ఎస్. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు.
మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
– రజనీకాంత్
ఆమె పాడిన పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి... కానీ ఆ ప్రేమను నేను ఎక్కడ వెతకాలమ్మా... భరించలేని దుఃఖంలో చాలామంది ఉన్నారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి.
– కమల్‌హాసన్
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనక జానకమ్మగారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు, మళ్లీ కళ్ల ముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మగారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
– చిరంజీవి
గాన కోకిల, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది సంగీతాభిమానులను అలరించిన జానకమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి చిత్రాలతో పాటు... నా చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ ΄÷ందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
– బాలకృష్ణ
ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎస్. జానకిగారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు గాయనీమణుల్లో ఒక ఆణిముత్యం లాంటివారు జానకిగారు. ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ‘నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, స్వాతి ముత్యం, జగదేక వీరుడు అతిలోకసుందరి, ప్రతిఘటన, అంతఃపురం’ లాంటి చిత్రాల్లో జానకిగారు పాడిన గీతాలను తెలుగు వారు ఎప్పటికీ మరచిపోరు.
– పవన్ కల్యాణ్


