సోషల్‌ మీడియా డైట్ మేనియా | Sakshi Funday Special Story: Nutrition Advice on Social Media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా డైట్ మేనియా

Jul 12 2026 5:50 AM | Updated on Jul 12 2026 5:50 AM

Sakshi Funday Special Story: Nutrition Advice on Social Media

‘మొలకెత్తిన గింజలు తినండి... జబ్బులన్నీ పరార్‌’
‘చిరుధాన్యాలు తినండి... చిటికెలో ఆరోగ్యం పొందండి’
‘రోజూ పాతిక గుడ్లు తినండి... తేలికగా బరువు తగ్గించుకోండి’
‘ఆకుకూరలు తినండి.... ఆయురారోగ్యాలు పొందండి’

ఇవన్నీ సోషల్‌ మీడియాలో మార్మోగిపోయే మాటలు. యూట్యూబ్‌ తెరిచినా, ఇన్‌స్ట్రాగ్రామ్‌ తెరిచినా ఉచిత ఆరోగ్య, ఆహార సలహాలతో ఊదరగొట్టే మహానుభావులు కనిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటనే దానిపై వీరెవరికీ ఏకాభిప్రాయం ఉండదు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సిద్ధాంతం. ఒకరు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినాలంటారు. ఇంకొకరు ఆకులు అలములు మొలకలతోనే అద్భుతమైన ఆరోగ్యం సాధ్యమని ప్రవచిస్తారు. మరొకరు ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించవచ్చని నమ్మకంగా చెబుతారు.

‘నా సలహా పాటిస్తే డయాబెటిస్, బీపీ దగ్గరకే రావు; మీ గుండె ఉక్కు గుండులా మారుతుంది’ అని చెబుతారొకరు. ‘నేను చెప్పే ఆహార పద్ధతిని పాటిస్తే క్యాన్సర్‌ కూడా పరారవుతుంది’ అని సవాలు చేస్తారొకరు. ‘నేను చెప్పిన కషాయాలు తాగుతూ, ఆకులు అలములు మొలకలు తింటే అరవైలోనూ ఇరవైలా ఉరకలేస్తారు’ అని ఢంకా బజాయిస్తారు మరొకరు. సోషల్‌ మీడియాలో వీళ్ల వీడియోలు చూసే జనాలు గందరగోళంలో పడుతుండటం మామూలుగా మారింది.

 ముందు వెనుకలు ఆలోచించకుండా, నిపుణులను సంప్రదించకుండా, సోషల్‌ మీడియాలో ఊదరగొట్టే ఆహారారోగ్య ప్రవాచకుల సలహాలు పాటించడం వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారు ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలను ఊదరగొట్టేవారిలో అత్యధికులు వైద్యులు కాదు. కనీసం అర్హత కలిగిన న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు కూడా కాదు. వీళ్లంతా స్వయంప్రకటిత నిపుణులు. వీళ్లలో కొందరు కేవలం తోచిన సలహాలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా; డాక్టర్లను, ఆధునిక వైద్యరంగాన్ని పూచికపుల్లతో సమానంగా తీసిపారేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రబలుతోంది.

థంబ్‌నెయిల్‌ ప్రచారాలు
సోషల్‌ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. ఈ సలహాలు చెప్పేవారిలో చాలామందికి పోషకాహార శాస్త్రంలో గాని, వైద్యశాస్త్రంలో గాని ఎలాంటి అర్హతలూ ఉండవు. అర్హులైన వారి వీడియోల కంటే అనర్హుల వీడియోలే ఎక్కువగా సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా వీడియోలు ‘స్వయంప్రకటిత’ నిపుణులవే! సోషల్‌ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలు చెబుతూ వీడియోలు చేసేవారిలో అర్హులైన న్యూట్రిషనిస్టులు, వైద్యులు 30 శాతానికి లోపే ఉంటున్నారు.

‘సోషల్‌ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే ఆహార ఆరోగ్య సలహాలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. వీటిలో ఉండేది చాలావరకు తప్పుడు సమాచారమే’ అని కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలోని మెడిసిన్‌ రీసెర్చ్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లీ కేహిల్‌ తన అధ్యయనంలో వెల్లడించారు. ‘సోషల్‌ మీడియాలోని వీడియోలు చూస్తూ, రకరకాల ఆహార ప్రయోగాలు చేయడం వల్ల సమస్యల బారినపడ్డ వారు చాలామంది నా వద్దకు వస్తుంటారు. సోషల్‌ మీడియాలో చూసే సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో తెలుసుకునే ప్రయత్నం ఎవరికి వారే చేయాలి. పోషకాహారం గురించి, ఆరోగ్య సమస్యల గురించి సాధికారికమైన సమాచారాన్ని అందించే వెబ్‌సైట్లు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 

సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల గుండె సమస్యలతో బాధపడేవారు ఉత్తపుణ్యానికి పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నారు’ అని కెనడాలోని ఒటావాకు చెందిన రిజిస్టర్డ్‌ డైటీషియన్‌ వెరోనికా రోజ్‌ చెబుతున్నారు. పోషకాహారం గురించి సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న అపోహలను తొలగించి, శాస్త్రీయంగా వాస్తవాలను వెల్లడించడానికి తాను కూడా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పెడుతున్నట్లు ఆమె తెలిపారు.

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో ఆహార సలహాలు ఇచ్చేవారి వీడియోల్లో దాదాపు సగానికి సగం తప్పుడు సమాచారంతో కూడుకున్నవేనని ఆస్ట్రేలియాలోని డీకిన్‌ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫిజికల్‌ యాక్టివిటీ అండ్‌ న్యూట్రిషన్‌ (ఐపీఏఎన్‌) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. 

ఈ అధ్యయనం కోసం లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన వారి ఖాతాలనే నమూనాగా తీసుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించే అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అయితే, సోషల్‌ మీడియా ద్వారా ఈ అంశంపై జనాలకు అందుతున్న సమాచారంలో కచ్చితత్వం, ప్రామాణికత కొరవడుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. సోషల్‌ మీడియా ద్వారా అర్హతలు లేకుండానే పోషకాహార, ఆరోగ్య సలహాలు ఇచ్చేవారిని కొన్ని ఫుడ్‌ సప్లిమెంట్‌ బ్రాండ్లు తమ ప్రచారం కోసం కూడా వాడుకుంటున్నాయి’ అని ఈ అధ్యయనం జరిపిన రీసెర్చ్‌ స్కాలర్‌ ఎమిలీ డెన్నిస్‌ తెలిపారు. 

సోషల్‌ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు ఇచ్చే ఆహార ఆరోగ్య సలహాపైన, వారు ప్రచారం చేసే ఫుడ్‌ సప్లిమెండ్‌ బ్రాండ్లపై జనాలు అప్రమత్తంగా ఉండాలని ఎమిలీ హెచ్చరిస్తున్నారు.

తప్పుడు సమాచారానికి ఉదాహరణలు
సోషల్‌ మీడియాలో ఆహార ఆరోగ్యాల గురించి ప్రమాదకరమైన స్థాయిలో తప్పుడు సమాచారం వచ్చి పడుతోంది. సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న తప్పుడు ప్రచారం గురించి కొన్ని ఉదాహరణలు, వాస్తవాలు...

ప్రచారం: చక్కెర పూర్తిగా విషం. 
వాస్తవం: చక్కెర విషమేమీ కాదు. చక్కెర తక్షణ శక్తిదాయకం. పరిమిత మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు.

ప్రచారం: ఆల్కలైన్‌ వాటర్‌తో అన్నీ నయమైపోతాయి.
వాస్తవం: ఆల్కలైన్‌ వాటర్‌ శరీరంలోని పీహెచ్‌ స్థాయిని మార్చేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నా, ఇది పూర్తి అవాస్తవం. శరీరం తన పీహెచ్‌ స్థాయిని తానే నియంత్రించుకుంటుంది. ఆల్కలైన్‌ వాటర్‌ వల్ల శరీరంలోని పీహెచ్‌ స్థాయి అమాంతం మారిపోదు. దాని వల్ల వ్యాధులు నయం కావు.

ప్రచారం: గ్లూటెన్‌ చాలా హానికరం.
వాస్తవం: గోధుమలు, బార్లీ వంటి వాటిలో గ్లూటెన్‌ ఉంటుంది. వీటి పిండితో తయారు చేసే రొట్టెలు, బిస్కట్లు తదితర పదార్థాల్లో ఉండే గ్లూటెన్‌ కొద్దిమందికి సరిపడదు. ఈ పరిస్థితిని ‘గ్లూటెన్‌ ఇన్‌టాలరెన్స్‌’ అంటారు. ‘గ్లూటెన్‌ ఇన్‌టాలరెన్స్‌’ లేనివారికి గ్లూటెన్‌ వల్ల జరిగే హాని ఏమీ ఉండదు.

ప్రచారం: ఈ ఆహారాలతో క్యాన్సర్‌ నయమవుతుంది.
వాస్తవం: సీతాఫలం గింజలు, లక్ష్మణఫలం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు క్యాన్సర్‌ను నయం చేస్తాయని సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలతోను, ప్రత్యేక ఆహార పద్ధతులతోనే క్యాన్సర్‌ను నయం చేయడం అసాధ్యం. క్యాన్సర్‌కు కీమో థెరపీ, రేడియో థెరపీ, ఇమ్యూనో థెరపీ వంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది.

ప్రచారం: మా డైట్‌ ప్లాన్‌తో వారం రోజుల్లోనే పదికిలోల బరువు తగ్గవచ్చు
వాస్తవం: ఎలాంటి డైట్‌ ప్లాన్‌తోనైనా తక్కువ వ్యవధిలో ఎక్కువ బరువు తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అందుకు ప్రయత్నించినా, శరీరంలో పోషక లోపాలు ఏర్పడి అనర్థాలు తలెత్తవచ్చు.

ప్రచారం: డీటాక్స్‌ డ్రింక్స్‌ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తాయి.
వాస్తవం: నిమ్మరసం, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ సహా పలు డీటాక్స్‌ డ్రింక్స్‌ లివర్, కిడ్నీల పనిని పూర్తిగా భర్తీ చేస్తాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో లివర్, కిడ్నీలు సహజంగానే డీటాక్సిఫికేషన్‌ చేస్తాయి. ఇవి పాడైనప్పుడు తగిన వైద్య చికిత్స తప్పనిసరి.

ప్రచారం: డయాబెటిస్‌కు మందులు అక్కర్లేదు.
వాస్తవం: డయాబెటిస్‌కు మందులు వాడటం అనవసరమని; వేపాకు, నేరేడు ఆకు, మెంతాకు వంటి ఆకులు తీసుకుంటే పూర్తిగా  నయమవుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొన్నిరకాల ఆకులు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్వల్పంగా అదుపులోకి వచ్చినా, ఇవేవీ డయాబెటిస్‌ చికిత్సకు పూర్తి ప్రత్యామ్నాయం కావు.

ప్రచారం: నూనెలు, నెయ్యి, ఇతర కొవ్వులతోనే ఆరోగ్య సమస్యలు
వాస్తవం:  సమతుల పోషకాహారంలో కొవ్వులు కూడా తప్పనిసరి భాగంగా ఉండాలి. కొవ్వులను, నూనెలను పూర్తిగా మానేస్తే పోషక లోపాలు ఏర్పడతాయి. 
కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్ల లోపం ఏర్పడి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, కొవ్వులను తగిన మోతాదులో వాడాలి.

ప్రచారం: ఎంత కొవ్వు తిన్నా హానిలేదు.
వాస్తవం:  వెన్న, నెయ్యి, కొబ్బరినూనె ఎంత తిన్నా ఏమీ కాదని, వీటితో బరువు తగ్గవచ్చని కొందరి ప్రచారం. ఇవి మితిమీరితే బరువు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఎక్కువ. పైగా ఒంట్లో కొవ్వు మితిమీరితే అధిక బరువు మొదలుకొని గుండెజబ్బుల వరకు రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ప్రచారం: కీటో డైట్‌తో డయాబెటిస్‌ పూర్తిగా నయమవుతుంది.
వాస్తవం: కీటో డైట్‌ తీసుకుంటే, డయాబెటిస్‌ మందులతో పని ఉండదని కొందరి ప్రచారం. కీటో డైట్‌ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ కొంత మెరుగుపడవచ్చు. అలాగని డాక్టర్లు సూచించిన మందులు వాడటం ఆపేస్తే పరిస్థితి విషమించే ప్రమాదాలు ఉంటాయి.

తప్పుడు సమాచారం ఉచ్చులో యువతరం
సోషల్‌ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన తప్పుడు సమాచారానికి యువతరమే ఎక్కువగా ప్రభావితమవుతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. తెలిసీ తెలియని స్థితిలో ఉండే 18–25 ఏళ్ల లోపు వయసువారు ఈ వీడియోల ద్వారా ప్రభావితమై, కనీసం నిపుణులను సంప్రదించకుండా రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తూ ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని న్యూజీలండ్‌కు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ న్యూట్రిషనల్‌ సైకాలజీ’ అధ్యయనం వెల్లడించింది.

శరీరాకృతి, చర్మం తీరు, జుట్టు తీరు వంటి చిన్న చిన్న అంశాల్లో అపనమ్మకంగా ఉండే యువత సోషల్‌ మీడియాలో వచ్చే వీడియోల్లో చెప్పేవారి సలహాలు విని, వాటిని పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమతో స్వయంగా ప్రయోగాలు చేస్తున్నారని, అకస్మాత్తుగా ఆహారపు అలవాట్లను మార్చుకుని చిక్కుల్లో పడుతున్నారని ఈ అధ్యయనం జరిపిన బృందానికి నేతృత్వం వహించిన జాక్‌ ఆర్‌.హెచ్‌.కూపర్‌ చెబుతున్నారు.

‘కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో చాలామంది సోషల్‌ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాల పట్ల తేలికగా ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌ వంటి వాటిలో వచ్చే వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే సలహాలు పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మి ఆహార పద్ధతులపై ప్రయోగాలు చేస్తున్నారు. వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు ఊదరగొట్టే స్థాయిలో ఫలితాలు రాకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు’ అని కూపర్‌ వెల్లడించారు.

నియంత్రణ లోపమే అసలు సమస్య
పోషకాహార సలహాలు, ఆరోగ్య సలహాలు ఎవరు ఇవ్వాలనే దానిపై నియమ నిబంధనలు, నియంత్రణ లేకపోవడమే అసలు సమస్యగా ఉంటోంది. ఇతరేతర రంగాల్లో డిగ్రీలు ఉన్నవాళ్లు కూడా సోషల్‌ మీడియాలో స్వయంప్రకటిత పోషకాహార ఆరోగ్య నిపుణులుగా చలామణీ అవుతున్నారు. శరీరనిర్మాణ శాస్త్రం, పోషకాహార శాస్త్రం వంటి అంశాల్లో అవగాహన లేకుండానే, తాము నమ్మిన విషయాలనే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 కింద ఏర్పడిన ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆహార ఉత్పత్తులు, ఫుడ్‌ సప్లిమెంట్ల నాణ్యత ప్రమాణాలపై మాత్రమే నియంత్రణ కలిగి ఉంది.

ఆహార ఆరోగ్య సలహాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి ఎలాంటి నియంత్రణ లేదు. ఆహార ఆరోగ్యాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని నియంత్రించడానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేవు. మన దేశం నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ఆహార ఆరోగ్య అంశాలపై ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా వస్తున్న వీడియోల్లో దాదాపు 80 శాతం వరకు గుర్తింపు కలిగిన అర్హతలు లేనివారు చెబుతున్నవేనని ఒక అంచనా.

ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిలో ఆధునిక వైద్యంలోను; ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురోపతి తదితర వైద్య విధానాల్లోను; న్యూట్రిషన్, డైటెటిక్స్‌ విధానాల్లోను డిగ్రీలు కలిగిన వారు సుమారు 20 శాతం వరకు మాత్రమే ఉంటున్నారు. అయితే, అర్హతలు లేనివారి వీడియోలకు కూడా లక్షలాది ఫాలోవర్లు ఉంటుండటమే ఆందోళన కలిగించే అంశం.

తప్పుడు ప్రచారానికి కారణాలు...
సోషల్‌ మీడియాతో ప్రచారం మాత్రమే కాదు, డబ్బు కూడా దండిగా వస్తుంది. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్‌ వంటి సోషల్‌ మీడియా అల్గోరిథమ్స్‌ ఎక్కువమంది చూసే కంటెంట్‌ను మరింత ఎక్కువమందికి చూపిస్తాయి. దీనివల్ల ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. ప్రకటనల ఆదాయంలో కొంత వీటిలో వీడియోలు పెడుతున్నవారికి వస్తుంది. దీనికితోడు సప్లిమెంట్లు, డైట్‌ కోర్సుల అమ్మకాలకు కూడా సంబంధిత కంపెనీలు ‘స్వయంప్రకటిత’ నిపుణులను సాధనంగా ఉపయోగించుకుంటాయి. వీటి ద్వారా కూడా వారికి ఆదాయం వస్తుంది. 

ప్రచారానికి ప్రచారం, ఆదాయానికి ఆదాయం అప్పనంగా దొరుకుతుండటంతో కొందరు తమ చదువుకు, నైపుణ్యాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అకస్మాత్తుగా ఆహార ఆరోగ్య నిపుణులుగా సోషల్‌ మీడియాలో అవతారమెత్తుతూ జనాలను గందరగోళంలో ముంచుతున్నారు. కొంచెం దృష్టిపెడితే, సోషల్‌ మీడియాలో వస్తున్న వీడియోల్లో అసలైనవేవో, తప్పుడు ప్రచారంతో కూడినవేవో తేలికగానే కనిపెట్టవచ్చు. ‘డాక్టర్లు దాచిన రహస్యం!’, ‘ఫార్మసీ మాఫియా’, ‘శాస్త్రవేత్తలకే తెలియని ఆరోగ్య రహస్యం’, ‘వారం రోజుల్లో ఫ్యాటీ లివర్‌ నయం’, ‘క్యాన్సర్‌ను ఈజీగా తగ్గించవచ్చు’, ‘ఈ తైలంతో పక్షవాతం నయం’ వంటి థంబ్‌నెయిల్స్‌తో వచ్చే కంటెంట్‌లో చాలావరకు అవాస్తవాలే ఉంటాయి. 

వీటిని ప్రచారంలోకి తెచ్చేవారికి ఆహార, ఆరోగ్య, వైద్య శాస్త్రాలపై కనీస అవగాహన కూడా ఉండదు. సోషల్‌ మీడియాలో కొద్ది శాతమైనా అర్హులైన వైద్యులు కూడా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. కంటెంట్‌కు, పోస్ట్‌ చేసిన వారి అర్హతలను బేరీజు వేసుకుని ఈ వీడియోలను చూడటం క్షేమం.

∙పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement