కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు! | Jordan-Cox Leaks-Kohli-Private Chat-London Meeting-ENG Vs IND | Sakshi
Sakshi News home page

కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!

Jul 11 2026 11:42 AM | Updated on Jul 11 2026 12:15 PM

Jordan-Cox Leaks-Kohli-Private Chat-London Meeting-ENG Vs IND

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి కండ‌రాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే ప్రాక్టీస్ ఆరంభించిన కోహ్లి తొలి వ‌న్డేలో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా కోహ్లికి సంబంధించి ఒక సీక్రెట్ సంభాషణను ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోర్డాన్‌ కాక్స్‌ లీక్‌ చేయడం వైర‌ల్‌గా మారింది. 

కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ బ్యాట‌ర్ జోర్డాన్ కాక్స్ కోహ్లితో జ‌రిపిన ప‌ర్స‌న‌ల్ సంభాష‌ణకు సంబంధించిన ఫొటోలు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. దీనిపై జోర్డాన్ కాక్స్ స్పందించాడు. 'గ‌త నెల‌లో కోహ్లిని లండ‌న్‌లో క‌లిశాను. అయితే కోహ్లితో స‌మావేశాన్ని గోప్యంగా ఉంచాల‌ని భావించాను. కానీ మేమిద్ద‌రం మాట్లాడుకుంటున్న ఫొటోలు ఎవ‌రో ర‌హ‌స్యంగా చిత్రీక‌రించారు. తాజాగా ఆ ఫొటోలు బ‌య‌టికి లీక‌య్యాయి. 

మేమిద్ద‌రం మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో కొంద‌రు మా ప‌క్క నుంచి మాట్లాడుకుంటూ వెళ్లారు. నాకు తెలిసి వాళ్ల‌లోనే ఎవ‌రో ఒకరు మా ఫొటోలు తీసి సోష‌ల్ మీడియ‌లో షేర్ చేశార‌నిపించింది. నిజానికి కోహ్లి లండ‌న్‌లో ఒక ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌పాల‌ని అనుకున్నాడంట‌. కానీ ఇక్క‌డ కూడా త‌న‌కు పాపులారిటీ రావ‌డంతో ఇక‌పై లండ‌న్‌లో స్వేచ్ఛగా తిరిగే హ‌క్కు కోల్పోతానేమో అని కోహ్లి నాతో చెప్పాడు. 

ఇక ఐపీఎల్ స‌మ‌యంలో కోహ్లి నాకు అండ‌గా నిల‌బ‌డ్డాడు. కొంత‌మంది ఆట‌గాళ్లు త‌మ ఆట‌పై మాత్ర‌మే దృష్టి పెడుతుంటారు. కానీ కోహ్లి మాత్రం త‌న‌తో పాటు ఉండే స‌హ‌చ‌రుల‌కు సంబంధించి అన్ని విష‌యాల‌పై దృష్టి పెట్ట‌డ‌మే గాక అవ‌స‌ర‌మైతే స‌ల‌హాలు కూడా ఇస్తుంటాడు. ఇదే అత‌డిని ప్ర‌త్యేకంగా నిలిపింది' అని జోర్డాన్ కాక్స్ చెప్పుకొచ్చాడు.  

2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌ర్వాత పొట్టి ఫార్మాట్‌కు, ఆ త‌ర్వాత టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం వ‌న్డే ఫార్మాట్‌లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత కోహ్లి అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికే అవ‌కాశం కూడా ఉంది. కోహ్లితో పాటు రోహిత్ శ‌ర్మ కూడా త‌న రిటైర్మెంట్‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే చాన్స్ ఉంది. 

ప్ర‌స్తుతం శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ గెలుచుకుంది. సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ నేడు సౌతాంప్ట‌న్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ గండం నుంచి త‌ప్పించుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది.

ఇక జూలై 14 నుంచి 19 మధ్య ఇంగ్లండ్‌, భారత్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 311 వ‌న్డేల్లో 14,797 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు, 77 అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి.

చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్ ఓట‌మి.. తొలి దెబ్బ అత‌డికేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement