ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా విదేశీ గడ్డ మీద టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.
తొలుత పసికూన చేతిలో
టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్‌గా ఐర్లాండ్‌లో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో భారత్ ఓటమిపాలైంది.
ఫలితంగా ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అనుచిత నిర్ణయాల వల్లే
సెలక్షన్ విషయంలో అనుచిత నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ గతి పట్టిందని చిక్కా మండిపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడైన కేఎల్ రాహుల్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..
గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌ను భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి శుబ్‌మన్ గిల్‌కు ఓ అవకాశం దక్కింది. వన్డే, టెస్టు కెప్టెన్ అయిన అతడిని నేరుగా టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు.
అతడిని టీ20 ఫార్మాట్లోనూ ఆడించండి
కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ తర్వాత గిల్‌ను పక్కనపెట్టేశారు. అయితే, కేఎల్ రాహుల్‌కు కనీసం అలాంటి ఒక్క అవకాశం కూడూ దక్కలేదు. రాహుల్‌ను కేవలం టెస్టు, వన్డేలకే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది.

ఫ్లాట్ పిచ్‌ల మీదే మనోళ్ల ప్రతాపం
నిజానికి అతడి టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఎలాంటి పిచ్ మీద అయినా రాహుల్ ఆడగలడు. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ పిచ్‌ల మీద మాత్రమే పరుగుల వరద పారిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికా భయపెట్టగానే.. వెంటనే పిచ్‌లు మార్చమని మనోళ్లు అడిగారు.
ఇక ఐపీఎల్‌లో లక్నో పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మన బ్యాటర్లు తడి టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తూ పేస్, బౌన్సీ కండిషన్లకు మరింతగా అలవాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ చివరగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడాడు. ఇప్పటికి మొత్తంగా 72 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2265 పరుగులు సాధించాడు. సగటు 37.7 కాగా స్ట్రైక్‌రేటు 139.13. రాహుల్ ఖాతాలో 22 టీ20 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.


