యుద్ధాల్లో పాల్గొనే వీరులు సింహనాదాలు చేసేవారని పురాణాల్లో చదువుకున్నాం. అడవిలోని సింహం గర్జిస్తే, ఆ గర్జన ఏకంగా ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అడవి అడవంతా ప్రతిధ్వనిస్తుంది. సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్ ఉంటుంది. సింహగర్జనను మించిన శబ్దంతో పెనుకేక పెట్టి ఆస్ట్రేలియన్ పెద్దమనిషి ఒకరు గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన జోసెఫ్ మెక్‌గ్రాల్ బేటప్ అనే 58 ఏళ్ల వ్యక్తి ‘నౌ’ అని పెనుకేక పెట్టాడు.
ఆ కేక శబ్దం 122.4 డెసిబల్స్. అతడి కేకకు దెబ్బకు గిన్నిస్ రికార్డు బద్దలైంది. అంతకు ముందు 1994లో నార్త్ ఐర్లండ్ టీచర్ అనాలీసా ఫ్లాంగన్ ఇలాగే పెనుకేక పెట్టింది. ఆ శబ్దం 121.7 డెసిబల్స్‌గా నమోదై గిన్నిస్ రికార్డుకెక్కింది. ఇన్నాళ్లకు జోసెఫ్ పెట్టిన పెనుకేక ఆ రికార్డును అధిగమించింది. రికార్డు బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో జోసెఫ్ అంత పెద్ద పెనుకేక వేశాడు గాని, ఆ తర్వాత కొద్దిరోజులు అతడి గొంతు బొంగురుపోయింది.


