దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకికి ఆదివారం (జూలై 12) మైసూర్‌లో అంతిమ వీడ్కోలు పలకనున్నారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మైసూర్‌లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచనున్నారు. అభిమానులు, సినీ, సంగీత ప్రముఖులు ఈ సమయంలో నివాళులర్పించేందుకు అవకాశం కల్పించారు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు మైసూర్ నగర శివారులోని కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఫామ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, సంగీత రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. అభిమానుల భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో ఎస్. జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ గొప్ప గాన కోకిలను కోల్పోయిందంటూ రాజకీయ, సినీ, సంగీత ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


