జ్యుడీషియల్‌ అధికారుల నిర్బంధంపై సీరియస్‌  | SupremeCourt serious note of seven judicial officials being taken hostage | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్‌ అధికారుల నిర్బంధంపై సీరియస్‌ 

Apr 3 2026 5:31 AM | Updated on Apr 3 2026 5:31 AM

SupremeCourt serious note of seven judicial officials being taken hostage

సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్‌ అధికారులను నిరసనకారులు నిర్బంధించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని గురువారం ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగిన రక్షణ కల్పించలేకపోయారని బెంగాల్‌ ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడింది. 

జ్యుడీషియల్‌ అధికారులను జనం ఘెరావ్‌ చేసి, దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్‌ పట్ల అభ్యంతరాలను పరిష్కరిస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి సూచించింది. జ్యుడీషియల్‌ అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం సుప్రీంకోర్టు అధికారానికే సవాలు విసరడంతో సమానమని ఆక్షేపించింది.

 ఎస్‌ఆఐర్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం మాల్డా జిల్లాలోని కాలియచౌక్‌లో జ్యుడీషియల్‌ అధికారులను నిరసనకారులు తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. ఆహారం, నీరు కూడా ఇవ్వలేదు. అర్ధరాత్రి తర్వాత భద్రతా సిబ్బంది వారిని రక్షించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. అది ఘెరావ్‌ కాదని, రాజకీయ నిరసన అంటూ బెంగాల్‌ ప్రభుత్వం వివరణ ఇవ్వగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. 

అది సాధారణ ఘటన కాదని, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య అని పేర్కొంది. బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా మేజి్రస్టేట్, ఎస్పీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. మాల్డా జిల్లా ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 6న తమ ఎదుట ఆన్‌లైన్‌ ద్వారా హాజరు కావాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 700 మంది జ్యుడీషియల్‌ అధికారులు బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలను పరిష్కరిస్తున్నారు. వీరంతా బెంగాల్‌తోపాటు ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందినవారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement