కృత్రిమ మేధస్సు కంటే మానవ మేధస్సుకే ప్రాధాన్యమివ్వండి
ఏఐ సాధనాల విషయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి
న్యాయాధికారులకు స్పష్టం చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వొకేట్ కమిషనర్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ.. ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులిచ్చారు.
అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌లో తేల్చుకోవాలని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో నాలుగు తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాణి, మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలను ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు.
ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారులు తమ విచక్షణను, న్యాయపరమైన ఆలోచనను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలే తప్ప, ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేలి్చచెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐను ఉపయోగించే వారు, అది అందించే సమాచారాన్ని, తీర్పులను అత్యంత జాగ్రత్తగా, కఠినంగా పరిశీలించాలని సూచించారు.
‘ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా, ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగినా అవి వాస్తవంగా, చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులను సృష్టించడంతోపాటు సమస్యకు సంబంధం లేని తీర్పులను తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం దెబ్బతింటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అందుకే.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం
‘ప్రస్తుత కేసులో కింది కోర్టు న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో ఏఐ సాధనాన్ని ఉపయోగించి ప్రస్తావించిన తీర్పులు అసలు ఉనికిలోనే లేవు. కానీ.. ఆ న్యాయాధికారి ఆ కేసుకు చట్టబద్ధమైన న్యాయసూత్రాన్ని మాత్రం సక్రమంగానే అన్వయించారు. సీపీసీ ప్రకారం అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం ఒక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరాలుంటే ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవచ్చని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో చెప్పారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ నివేదికను కొట్టివేయాల్సిన అవసరం లేదని కూడా ఆ న్యాయాధికారి చెప్పారు. ఇదే చట్టబద్ధమైన న్యాయసూత్రం. దీనిని ఆ న్యాయాధికారి ఈ కేసుకు సరైన రీతిలో అన్వయింప చేశారు. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం గానీ, న్యాయపరిధి ఉల్లంఘన గానీ లేనే లేదు. అందువల్ల ఆ ఉత్తర్వుల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని తేల్చి చెప్పారు. ఉషారాణి, మరొకరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్‌పీ)ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు వెలువరించారు.


