జంతువుల కొవ్వు కలిసిందనే దానిపై మాట్లాడొద్దు
సిట్ నివేదికపై దుష్ప్రచారం చేస్తున్నారనండి
మంత్రులకు చంద్రబాబు సూచనలు
కొందరు మంత్రులు రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారని వ్యాఖ్య
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్‌సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్‌సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం.
గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్‌సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మంత్రుల పనితీరుపై అసంతృప్తి..
చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్‌సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది.


