ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర పెండింగ్
రూ.500 కోట్ల మేర మందులు, సర్జికల్స్ సరఫరా చేసిన కంపెనీలకు బాబు ప్రభుత్వం మొండిచేయి
బిల్లులు ఇవ్వకపోతే పరికరాలు సరఫరా చేయలేమని కంపెనీల హెచ్చరిక
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన వైద్యశాఖను ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. రూ.వందల కోట్ల బిల్లులను కనీసం ప్రాసెస్ చేయకుండా ఏపీఎంఎస్‌ఐడీసీ స్థాయిలోనే తొక్కి పెట్టేస్తున్నారు. దీంతో మందులు, సర్జికల్స్ సరఫరా చేయలేమంటూ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి.
ప్రభుత్వం కంపెనీలకు ఏకంగా రూ.500 కోట్ల మేర బకాయి పడినట్టు తెలుస్తోంది. ఆ బిల్లులను రాబట్టుకోవడం కోసం సరఫరాదారులు వైద్య, ఆర్థిక, శాఖలతో పాటు ‘ముఖ్య’నేత కార్యాలయంలోని ఉన్నతాధికారులను ప్రాధేయ
ç³డుతున్నప్పటికీ నిధులు మాత్రం రావడం లేదు. మొత్తం పెండింగ్ బిల్లుల్లో రూ.200 కోట్ల మేర ఇప్పటికే ఎంఎస్‌ఐడీసీ నుంచి ప్రాసెస్ చేసి సీఎఫ్‌ఎంఎస్‌కు ఎక్కించారు. రూ.150 కోట్ల మేర నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) బిల్లులు ఆగిపోయాయి.
మరో రూ.150 కోట్ల మేర బిల్లులు పూర్తిస్థాయిలో ప్రాసెస్‌కు నోచుకోవడం లేదు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో నాలుగో క్వార్టర్ సరఫరా చేయలేమని ఇప్పటికే పలు కంపెనీలు అధికారులకు తెగేసి చెప్పినట్టు సమాచారం. గత కొద్ది నెలలుగా బాబు గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వాస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. నిబంధనల మేరకు ఉండాల్సిన అన్ని మందులు, సర్జికల్స్ అందుబాటులో ఉండడం లేదు.
మందులు బయట నుంచి తెచ్చుకోవాలట..
ఈ నేపథ్యంలో మందులు, సర్జికల్స్ బయట కొనుక్కోవాలని రోగులకు సిబ్బంది చీటీలు రాసిస్తున్నారు. గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనూ డీఎంఈ ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా ఇవ్వలేదని దాదాపు 40 శాతం మేర రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంత దుర్భర పరిస్థితులు ఉంటే సరఫరా అయిన అరకొర మందులకు కూడా ప్రభుత్వం కంపెనీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదు.
అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించకపోవడంతో జీజీహెచ్లలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం సరఫరా చేయని మందులను జీజీహెచ్‌లకు వచ్చే ఆరోగ్యశ్రీ నిధులతో కొనుగోలు చేస్తుంటారు. ఆ నిధులను చెల్లించకపోవడంతో ఆస్పత్రులకు సైతం మందులు, సర్జికల్స్ ఇవ్వలేమని కంపెనీలు తేల్చి చెప్పేస్తున్నాయి.


