లింగమనేనికి రాజ్యసభ..
బాలశౌకి మంత్రి పదవికి పట్టు
వీరిద్దరి కోసం కేంద్ర హోంమంత్రి
అమిత్ షాతో పవన్‌కళ్యాణ్ మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన వర్గానికి పదవుల కోసం హస్తిన వేదికగా లాబీయింగ్‌కు తెరలేపారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఇక్కడికొచ్చి తన బంధువు, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా ఇప్పుడు అదే బాటపట్టారు.
తనకు, సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన పార్టీ లో కీలకంగా ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలÔౌరికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించాలని బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
లింగమనేని కోసం పవన్ ఆరాటం..
త్వరలో ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వీటికోసం అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వేదికగా పైరవీలు చేస్తుండగా.. సీఎం చంద్రబాబు ఇటీవల తన అస్మదీయుల కోసం అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్‌కు అత్యంత ఆప్తుడుగా ఉన్న కిలారు రాజేశ్‌కు రాజ్యసభ సీటు కేటాయించాలని చంద్రబాబు అడగ్గా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కూడా రాజ్యసభలో చోటు కల్పించాలని పవన్ తాజాగా పట్టుబడుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే ఆయన కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏడాది క్రితం ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి పంచుకున్నాయి. అప్పట్లో పవన్ లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో జనసేన నుంచి లింగమనేని రమేష్‌కు అవకాశం కల్పించాలంటూ పవన్ అమిత్ షాను అడిగినట్లు తెలుస్తోంది.
తమ పార్టీ కి మంత్రి పదవిస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఎదుట పవన్ విన్నవించినట్లు సమాచారం. కాగా ఉప్పాడ సముద్ర రక్షణ కోసం గోడ నిర్మాణం, రాష్ట్రంలో పరిపాలన, ఇతర ముఖ్యమైన విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లు పవన్‌కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


