పోలవరం ప్రాజెక్టులో రూ.247.12 కోట్ల విలువైన పనులను మేఘాకు నామినేషన్ పద్ధతిపై అప్పగింతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అవసరమైన అదనపు రాళ్లు, మట్టిని 902 హిల్ నుంచి తవ్వుకునే పనులుఅప్పగింత
2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసిన బాబు సర్కారు
పుంగనూరు బ్రాంచ్ కాలువలో రూ.480.22 కోట్ల విలువైన లైనింగ్ పనులు ఎన్‌సీసీ సంస్థకు నామినేషన్‌పై అప్పగింత
అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో భారీ పనులు అప్పగించడం వెనుక కారణాలు ఏమిటన్నది బహిరంగ రహస్యమే
2019–24లో నామినేషన్ పద్ధతికి వైఎస్సార్‌సీపీ సర్కార్ మంగళం
ఒక్క పనిని కూడా నామినేషన్ పద్ధతిపై అప్పగించని వైనం
సాక్షి, అమరావతి : రూ.లక్షలోపు విలువైన పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ).. రూ.2 లక్షలలోపు విలుౖవెన పనులను సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ).. రూ.3 లక్షలలోపు విలువైన పనులను ఛీఫ్ ఇంజినీర్ (సీఈ) నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదికూడా వరదలు, కరువు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన.
ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. ఇటీవల కాలువల మరమ్మతులు, పూడికతీత వంటి సాగునీటి సంఘా కు చెందిన రూ.10 లక్షల వరకూ విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించేలా నిబంధనలను సవరించారు. ఈ నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన ప్రభుత్వమే.. వాటికి నిలువునా పాతరేసింది.
ఏకంగా రూ.247.12 కోట్ల పనులకూ ‘నామినేషన్’
రూ.లక్ష కాదు.. రూ.2 లక్షలు కాదు. పోలవరం ప్రాజెక్టులో ఏకంగా రూ.247.12 కోట్ల విలువైన పనులను అస్మదీయ కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేయడానికి బుధవారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లో బట్రెస్ డ్యామ్, ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ఇప్పటికే తవ్విన రాయి, మట్టితోపాటు అదనంగా అవసరమయ్యే మట్టి, రాళ్లను 902 హిల్ నుంచి తవ్వి తీసుకునే పనులను ఆ ప్రాజెక్టు పనులు చేస్తున్న మేఘా సంస్థకే నామినేషన్‌పై కట్టబెట్టేయడం గమనార్హం.
అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు కట్టబెట్టి, ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం 2014–19 మధ్య అప్పటి ప్రభుత్వ ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట.
దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో మంగళం పాడేసినా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతికి మంగళం పాడింది. 2019–24 మధ్య ఐదేళ్లలో నామినేషన్‌పై పనులు అప్పగించకుండా టెండర్ల ద్వారా పారదర్శకంగా పనులు అప్పగించింది. పోలవరం హెడ్ వర్క్స్‌లో చంద్రబాబు సర్కార్ నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసి.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించింది.
తక్కువ ధరకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.680 కోట్లను ఆదా చేసింది. కేంద్ర జలసంఘం సూచనల మేరకు పోలవరం ప్రాజెక్టులో స్పిల్ ఛానల్‌కు ఆర్‌సీసీ డయాఫ్రం వాల్ ఎండ్ కటాఫ్, ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో వైబ్రో స్టోన్ కాలమ్స్–డీప్ సాయిల్ మిక్సింగ్, గ్యాప్–1లో డయాఫ్రం వాల్ కటాఫ్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు ఇరువైపులా ఏటవాలుగా రక్షణ పనులకు 2021 మే 7న రూ.683 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది.
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.669.47 కోట్లకు మేఘాకు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.13.53 కోట్లను ఆదా చేసింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తేవడం, సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేసే పనులకు 2023 ఏప్రిల్ 28న 1615.75 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది.
రివర్స్ టెండరింగ్ ద్వారా 1,599.21 కోట్లకు మేఘాకు అప్పగించింది. దీనివల్ల ఖజానాకు రూ.16.54 కోట్ల ఆదా అయ్యాయి. ఇప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అదనంగా అవసరమైన మట్టి, రాయిని 902 హిల్ నుంచి సమకూర్చుకునే పనులకు టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిపై బాబు సర్కార్ అప్పగించడం వెనుక కారణాలు ఏమిటన్నది బహిరంగ రహస్యమేనని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
హంద్రీ–నీవాతో షురూ
చంద్రబాబు సర్కార్ 2024లో అధికారంలోకి వచ్చీ రాగానే హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల ద్వారా నామినేషన్ దందాకు తెరతీసింది. ఈ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ. వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021 సెప్టెంబర్ 4న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతి ఇచ్చింది.
ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్‌సీసీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023 ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్‌సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయని అధికార వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో ఎంత మిగిలాయన్నది తేల్చవచ్చు.
కానీ.. ఇక్కడ పనులు పూర్తికాకముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందని తేల్చడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 75.075 కి.మీ. నుంచి 207.80 కి.మీ. వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్‌సీసీ సంస్థకు అప్పగిస్తూ 2024 డిసెంబర్ 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


