అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కలికిరి పంచాయతీ సత్యాపురంలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముంగర రామకృష్ణరాజు, సుకన్య కుమారుడు వినీత్‌కుమార్‌రాజు(25) కలికిరి క్రాస్ రోడ్డులోని అబు మొబైల్స్ దుకాణంలో పని చేస్తున్నాడు. దుకాణం యజమాని అబు కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి రాయచోటిలో పార్టీ ఇచ్చాడు. అబు కారులోనే స్నేహితులైన వినీత్‌కుమార్‌రాజు, నౌషాద్ బాషా (బబ్లూ), అహ్మద్, నరేష్ వెళ్లారు.
అక్కడ అందరూ మద్యం తాగి, రాత్రి 11 గంటలకు కలికిరికి బయలుదేరారు. కలికిరి క్రాస్ రోడ్డులోని మొబైల్ దుకాణం వద్ద యజమాని అబు, అహ్మద్ కారు దిగిపోగా, డ్రైవరుగా ఉన్న బబ్లూ అక్కడి నుంచి వినీత్‌కుమార్‌రాజు, టి.మాదిగపల్లికి చెందిన నరేష్‌ను వారి ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరాడు. సత్యాపురంలో వినీత్‌కుమార్‌రాజును దింపేసిన అనంతరం అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న టి.మాదిగపల్లిలో నరేష్ ను దింపాడు. తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో రోడ్డు పక్కన ఉన్న వినీత్‌కుమార్‌రాజును కారుతో ఢీకొట్టాడు. ఈ విషయం బబ్లూ తన స్నేహితుడు అహ్మద్‌కు తెలియజేశాడు.
వెంటనే అహ్మద్ అక్కడికి చేరుకున్నాడు. కానీ, స్థానికులు రావడంతో బబ్లూ, అహ్మద్ పారిపోయారు. దీంతో స్థానికులు 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వినీత్‌కుమార్‌రాజు మృతిచెందాడు. శనివారం వేకువజామున మూడు గంటలకు వినీత్‌కుమార్‌రాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీఐ అనిల్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన
శుక్రవారం అర్ధరాత్రి తమ కుమారుడు చనిపోతే శనివారం ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుని తల్లి సుకన్య, బంధువులు శనివారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే తమకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని సీఐ వెల్లడించారు. ఆందోళన అనంతరం రాత్రి మీడియా ముందు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీఐ అనిల్‌కుమార్.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొబైల్ దుకాణం యజమాని అబు, కారుడ్రైవర్ బబ్లూ(నౌషాద్ బాషా), నరే‹Ù, అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.


