సాక్షి, అన్నమయ్య జిల్లా: మరో మారు క్రెడిట్ చోర్‌గా మారిన చంద్రబాబు.. వైఎస్ జగన్ హయాంలో మంజూరై పూర్తి చేసుకున్న ఇళ్లకు గృహ ప్రవేశం అంటూ హడావుడి చేశారు. 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అంటూ అన్నమయ్య జిల్లాలో హడావుడి సృష్టించారు. లబ్దిదారులను పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబే ఇల్లు మంజూరు చేసినట్లు ఆయన డబ్బా కొట్టించుకున్నారు. 2022లో మంజూరై 2023లోనే ఇల్లు పూర్తి అవ్వగా.. ఇప్పుడు తానే ఆ ఇళ్లను ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో చంద్రబాబు బాగోతం బయటపడింది.
కూటమి సర్కార్ వచ్చాక సెంటు స్థలం, ఒక్క ఇల్లు కూడా ఇవ్వని చంద్రబాబు.. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వైఎస్ జగన్ మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసేసుకున్నారు. పక్కా ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. తాను గృహ ప్రవేశం చేయించిన ఇళ్లే తానివ్వక పోతే ఇక 3 లక్షల ఇళ్ల మాటేమిటంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులతో కూడా అబద్ధాలు చెప్పించి మరీ చంద్రబాబు.. క్రెడిట్ కొట్టేశారు.
దేవగుడిపల్లికి చెందిన ఎస్.ముంతాజ్ బేగంకు 2021-22లో ఇళ్లు మంజూరైంది. వైఎస్ జగన్ హయాంలో 2022 మే 9వ తేదీన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఇంటి నిర్మాణ నగదు జమ అయ్యింది. జూన్ 2023కి ఇంటి నిర్మాణం రూఫ్ లెవల్‌కి వచ్చింది. దేవగుడిపల్లికి చెందిన ఎం.హేమలతకు 2022 జులై 9వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో నగదు జమ అయ్యింది. వైఎస్ జగన్ హయాంలోనే 2024 మార్చి 19కి ఇంటి నిర్మాణం రూఫ్ లెవల్‌కి వచ్చింది. అయినా తానే మంజూరు చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు.


