సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుంది

ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?
కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు.


