మృత్యువు మింగేసింది.. నిశీధి వేళలో నలుగురు స్నేహితులను కర్కశంగా కబళించేసింది.. వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.. నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది.. మృతదేహాల్ని మూటగట్టింది.. సరదాగా కారులో బయలుదేరిన వారికదే ఆఖరి మజిలీ అయ్యింది. ఆశల్ని,ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది.. కన్నవారికి, తోబుట్టువులకు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ముగ్గురు మొగల్రాజపురానికి చెందిన వారు కాగా, మరొకరు కంకిపాడు మండలం కుందేరుకు చెందిన యువకుడు. ఘటనపై ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్నప్పటి నుంచీ మిత్రులే..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని మొగల్రాజపురానికి చెందిన చాట్రగడ్డ రాకేష్ బాబు(24), ఈటె ప్రిన్స్‌బాబు(22), గొరిపర్తి పాపారావు అలియాస్ పాపయ్య(23) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. పదో తరగతి వరకూ కలిసే చదివి, ఆ తరువాత కూడా స్నేహం కొనసాగించారు.మొగల్రాజపురం బందులదొడ్డి సెంటర్ సమీపంలో నివాసం ఉండే రాకేష బాబు తండ్రి చక్రపాణి దస్తావేజు లేఖరి. చక్రపాణికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుండగా, చిన్న కుమారుడైన రాకేష్ తండ్రికి సహాయంగా ఉంటున్నాడు. ఇటీవలే స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ఐజీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో అటెండరుగా చేరాడు. కుమారుడి మర ణ వార్తతో చక్రపాణి సొమ్మసిల్లి పడిపోయాడు.
ఇందిరాగాంధీ స్టేడియం సమీపంలోని గిరిపురంలో ఉండే ఈటే ప్రిన్స్‌బాబు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ప్రిన్స్ తండ్రి రామయ్య రాడ్ బెండింగ్ కార్మికుడు.
పాపారావు అలియాస్ పాపయ్య మొగల్రాజపురంలోని బాలభాస్కర నగర్ కనకదుర్గ మ్మ గుడి రోడ్డులో కొండపైన నివాసం ఉండే గొరిపర్తి శివయ్య, యశోదకు రెండో కుమారుడు. ఈయన మెడికల్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. పాపయ్య తండ్రి శివ య్య ట్రాక్టరు డ్రైవరు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపయ్య మాట్లాడుతుండటంతో కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పాపయ్య చికిత్స పొందుతూ మరణించారు.
కొణతం చింతయ్య(19)ది కంకిపాడు మండలం కుందేరు స్వగ్రామం. చింతయ్య వ్యవసాయ కూలీ. చింతయ్య తండ్రి బాలకృష్ణ పాల వ్యాపారం చేస్తుంటాడు. అటు వ్యవసాయం, ఇటు పశుపోషణ సాగిస్తూ చింత య్య కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. మృతుల్లో ఒకరైన పాపారావుది కూడా కుందేరు గ్రామమే. అయితే కొన్నాళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డారు.
తల్లడిల్లి.. సొమ్మసిల్లి..
బయటకు వెళ్లిన బిడ్డలు ఇంటికి వస్తారని ఆశగా చూస్తున్న ఆ కుటుంబాలకు విషాదమే మిగిలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వచ్చిన ఫోన్‌తో గండిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డలు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాలను శోకంలో ముంచెత్తింది. స్నేహితుడి కోసం వెళ్తున్నామని చెప్పి, పుట్టినరోజు వేడుక అని చెప్పి బయటకు వెళ్లి శవమై తిరిగి వచ్చారంటూ మృతుల తల్లిదండ్రులు, రక్తసంబం«దీకులు పెట్టిన రోధనలు ప్రతి ఒక్కరినీ కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. బిడ్డల మృతదేహాలను చూస్తూ తల్లిడిల్లి సొమ్మసిల్లి పడ్డ కుటుంబ సభ్యులను చూసి అందరి మనసూ చలించింది. విజయవాడ నుంచి ఎందుకు వచ్చారు? ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? ఉయ్యూరు వైపు ఎందుకు వస్తున్నారు? రావాల్సిన అవసరం ఏముంది? అర్థం కాని స్థితిలో రోడ్డు ప్రమాదం తమ బిడ్డలను తీసుకెళ్లిపోయిందంటూ మృతుల బంధువుల రోదనలు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటాయి. తోడుగా ఉంటారనుకున్న కొడుకులకు తల కొరివి పెట్టే శిక్ష ఎందుకు వేశావంటూ గుండెలు బాదుకుంటూ రోధించారు.
కలిసే మృత్యు ఒడికి..
చాట్రగడ్డ రాకేష్ బాబు స్నేహితుడిని రైల్వేస్టేషన్‌లో దింపుతానని సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి కారు తీసుకుని బయలుదేరి వెళ్లాడు. స్నేహితులు ప్రిన్స్‌బాబు, పాపయ్యను ఎక్కించుకున్న రాకేష్‌బాబు కుందేరులో ఉంటున్న పాపయ్య బంధువు వరుసకు తమ్ముడు కొణతం చింతయ్య వద్దకు వచ్చారు. తమ స్నేహితుడి పుట్టినరోజు అని చెప్పి చింతయ్యను కూడా కారులో ఎక్కించుకుని వెళ్లారు. రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కొడుకు ఎంతకూ రాకపోయే సరికి రాకేష్‌బాబు తండ్రి చక్రపాణి అర్ధరాత్రి 12, ఒంటి గంట మధ్యలో ఫోన్ చేయగా తాను పాతపాడు చర్చికి వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే వీరంతా కుందేరులో చింతయ్యను ఎక్కించుకుని విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి మీదుగా ఉయ్యూరు వైపు ప్రయాణం సాగించారు.
వీరు ప్రయాణిస్తున్న కారు గండిగుంట సమీపంలోని పెట్రోలు బంకు 1.32 గంటలకు క్రాస్ అయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం 1.34 గంటల సమయంలో అదుపుతప్పింది. జాతీయ రహదారి, సర్వసు రోడ్డుకు మధ్యన ఉన్న బోదెలోకి దూసుకెళ్లి మూడుకు పైగా పల్టీలు కొట్టింది. ఈ పల్టీలు కొట్టే క్రమంలో కారు పూర్తిగా ధ్వంసమై కారు అద్దాలలో నుంచి ఒక్కరొక్కరుగా రోడ్డుపై పడ్డారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని ఊహించని వారు తీవ్ర గాయాలపాలై తనువు చాలించారు. ఘటనాస్థలంలోనే ఈటే ప్రిన్స్‌బాబు, చాట్రగడ్డ రాకేష్‌బాబు, కొణతం చింతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన గొరిపర్తి పాపారావును 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందాడు. అతివేగం, మద్యం మత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ రహదారిపై డేంజర్ బెల్స్
జాతీయ రహదారి మార్గంపై డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి. ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాని భయానక పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు, ప్రజలు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై కామయ్యతోపు, తాడిగడప, పోరంకి, పెనమలూరు, ఈడుపుగల్లు, గోసాల సెంటర్, కంకిపాడు బైపాస్, ప్రొద్దుటూరు, దావులూరు టోల్‌గేట్, నెప్పల్లి సెంటరు, పెద ఓగిరాల, చిన ఓగిరాల, గండిగుంట, గురజాడ, తాడంకి, గోపువానిపాలెం అడ్డరోడ్డు, కనుమూరు, నిడుమోలు జంక్షన్, మొదలైన ప్రదేశాల్లో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారి నిర్మాణంలో లోపాలు, సర్వసు రోడ్డు జంక్షన్‌లు, రాత్రిళ్లు హైవేపై లైట్లు వెలగకపోవటం వంటి అనేక సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. దీనికి తోడు వాహనాల మితిమీరిన వేగం కూడా ప్రమాదాల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. ఎన్‌హెచ్ అధికారులు ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు నివారణ, వీధి దీపాలు నిర్వహణ తదితర అంశాలపై సామాజిక కార్యకర్తలు ఇటీవల స్వయంగా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవటం గమనార్హం.


