సాక్షి, విజయవాడ: రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సీఎం చంద్రబాబు స్పందించాలని సీపీఎం డిమాండ్ చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబుతో మాట్లాడి తాను నిలిపివేయించినట్లు రేవంత్ ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 40 టీఎంసీల నీరు రాయలసీమకు అందిస్తామని చంద్రబాబు ప్రజలను భ్రమపెడుతూ వచ్చారు. పథకాన్ని ఆపేయడానికి సీఎం అంగీకరించినట్లు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన అసలు నిజాలను బయటపెట్టింది’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
‘‘అదే నిజమైతే అది మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినవారు అవుతారు. నిగూఢ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తాయి. సీఎం చంద్రబాబు వాస్తవాలను వెల్లడించాలి. చీకటి ఒప్పందాలను దాచి పెట్టుకోవడానికే ఇరిగేషన్‌పై ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా సాగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రకటనకు సమాధానం ఇవ్వాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


