మోంథా...మానని గాయం | - | Sakshi
Sakshi News home page

మోంథా...మానని గాయం

Feb 22 2026 7:00 AM | Updated on Feb 22 2026 7:00 AM

మోంథా

మోంథా...మానని గాయం

సర్కారు నిర్లక్ష్యమే కారణం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

అదే సీజన్‌లో...

అన్నదాతలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలలు గడుస్తున్నా అందని సాయం పంట నష్టపరిహారం కోసం రైతుల ఎదురుతెన్నులు

మోంథా సాయం విడుదల చేయాలి

సర్కారు నిర్లక్ష్యమే కారణం

కంకిపాడు: మోంథా తుపాను చేసిన గాయానికి సర్కారు నిర్లక్ష్యం తోడవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే చంద్రబాబు సర్కారు రైతులను అడుగడుగునా నిరాశ పరుస్తోంది. మోంథా కలిగించిన నష్టానికి పంట నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రోజులు దాటవేస్తోంది. ఇప్పటికే తుపాను నష్టం జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా పంట నష్టపరిహారం అందక సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రబీ సాగుకు ఈ సాయం ఉపకరిస్తుందనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతులకు ఎండమావే అయింది.

జిల్లా వ్యాప్తంగా 2025 అక్టోబరు చివరి వారంలో సంభవించిన మోంథా తుపాను కారణంగా రైతులు భారీగా పంట నష్టపోయారు. పంట చేతికొచ్చే తరుణంలో తీవ్రమైన గాలులు, భారీ వర్షానికి ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, ఉద్యాన పంటలు నీటి ముంపునకు గురయ్యాయి. పంట పొలాల్లో ఉన్న మురుగు పంట బోదెల్లోకి మళ్లించటం, నీటిని తొలగించటంలో అసౌకర్యం కారణంగా రోజుల తరబడి నీరు, మురుగు పొలాల్లో నిలిచి పోవటంతో నేలవాలిన వరి పొలాల్లో కంకులు మొలకెత్తి పనికి రాకుండా పోయిన పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ ఇతర పంటలు 76,135.25 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, 60,055 మంది రైతులకు గానూ రూ.75.71 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా చెల్లించాలంటూ వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఉద్యానశాఖకు సంబంధించి 2056 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రూ.75.75 లక్షలు పరిహారంగా చెల్లించాలంటూ నివేదించింది.

పంట నష్టం అంచనాల్లోనూ కోతలే...

తమది రైతు సంక్షేమం అంటూ సర్కారు ప్రచారం ఊదరగొడుతున్నా ఆచరణలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు. మోంథా తుపాను కారణంగా జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో వరి, 3,742 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే నిబంధనల పేరుతో నష్టపరిహారం అంచనాల్లో భారీగా కోత విధించారు. తుది నివేదికల్లో వరి, ఇతర పంటలు 76135.25 ఎకరాల్లోనూ, ఉద్యాన పంటలు 2056 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తుది నివేదిక సమర్పించారు. నిబంధనల పేరుతో సాయం ఎగవేసేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నించటం స్పష్టమైంది. అధికారులు అందించిన నివేదికల ఆధారంగా పంట నష్టాన్ని పరిశీలించేందుకు నవంబరు నెలలో కేంద్ర బృందం పరిశీలించి వెళ్లటం గమనార్హం.

విపత్తులు సంభవించినప్పుడు ఏ సీజన్‌కు అదే సీజన్‌లో రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. 2019–2024 వరకూ సంభవించిన అనేక ప్రకృతి విపత్తుల వేళ రైతులకు సర్కారు అండగా నిలిచింది. అదే సీజన్‌లో పెట్టుబడి సాయం అందించి భరోసా ఇచ్చింది. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం దాట వేత ధోరణితో వ్యవహరిస్తోంది.

ఖరీఫ్‌లో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత అతలాకుతలమయ్యాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోంది. పైగా నష్టం అంచనాల్లోనూ భారీగా కోతలు పెట్టింది. ధాన్యం కొనుగోళ్లలోనూ అడుగడుగునా అన్యాయమే... సర్కారు దళారులకు గేట్లు ఎత్తివేసింది. రబీ సీజన్‌ వచ్చినా ఇంతవరకు సాయం ఊసే లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాలుగు నెలలు కావస్తున్నా కర్షకులకు మోంథా మానని గాయంగా ఇంకా బాధపెడుతూనే ఉంది.

మోంథా తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు చేతికొచ్చిన పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోళ్లలోనూ రైతులకు అన్యా యమే జరిగింది. దళారులు, మిల్లర్లు బరితెగించారు. మోంథా నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి రైతుల సమస్యలను వివరించాం. కానీ నేటికీ సాయం అందలేదు. యోగాంధ్ర, ఆవకాయ్‌ అమరావతి అంటూ వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం కౌలురైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. వాస్తవ సాగుదారులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రభుత్వం తక్షణమే స్పందించి మోంథా సాయం విడుదల చేయాలి.

–ఎం.హరిబాబు, కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి

మోంథా తుపాను సంభవించి నాలుగు నెలలు గడుస్తోంది. ఆ విపత్తులో జరిగిన నష్టాన్ని అధిగమించి రైతులు చేతికొచ్చిన వరి పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి అందిన కాడికి సొమ్ము చేసుకున్నారు. ఈ సమయంలో రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగానే వ్యవహరించింది. సకాలంలో రవాణా సదుపాయం, గోనె సంచులు కల్పించకుండా అవస్థల పాలు చేసింది. మిల్లర్లు, దళారులు రంగ ప్రవేశం చేసి తేమ శాతం సాకుగా చూపి అడ్డగోలుగా దోచుకున్న పరిస్థితి తెలిసిందే. ప్రస్తుతం రైతులు రబీ సాగుకు ఉపక్రమించారు. వరి, మినుము, పెసర, మొక్కజొన్న, ఇతర కూరగాయ పంటలను సాగు చేసుకుంటున్నారు. పెట్టుబడులకు అవసరమైన సొమ్ము సమకూర్చుకుంటున్నారు. అయితే మోంథా తుపాను నష్టపరిహారం అందిస్తే రబీ పెట్టుబడులకు ఊతంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కొంత వరకై నా అప్పుల సమస్య నుంచి తేరుకుంటామని అంటున్నారు. సాయం అందజేతకు ప్రభుత్వం స్పందిస్తుందో? లేదో? చూడాలి.

మోంథా...మానని గాయం 1
1/1

మోంథా...మానని గాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement