నూరు శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేయండి
జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు మార్కులు తెచ్చుకునేలా నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. విజయవాడ నార్త్ మండలానికి చెందిన పాఠశాలల ఉపాధ్యాయుల కోసం సబ్జెక్టు వారీగా క్లస్టర్ సమావేశం సింగ్‌నగర్‌లోని ఎంకే బేగ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల కోసం ‘‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’’ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో సమగ్ర పాఠ్య ప్రణాళిక, నిరంతర పరీక్షలు, వ్యక్తిగత శ్రద్ధ అవసరమన్నారు. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకూడదనే సంకల్పంతో ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో 9వ తరగతి విద్యార్థుల సమ్మెటివ్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు నిర్వహించి వారిని బోర్డు పరీక్షలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్‌లను పరిశీలించారు. ల్యాబ్ సదుపాయాలు, విద్యార్థుల ప్రయోగాత్మక పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంకే బేగ్ హైస్కూల్ హెచ్‌ఎం మైనం హుస్సేన్, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


