అంతులేని అరాచకం | - | Sakshi
Sakshi News home page

అంతులేని అరాచకం

Feb 22 2026 7:00 AM | Updated on Feb 22 2026 7:00 AM

అంతుల

అంతులేని అరాచకం

హద్దులు మీరి తవ్వకాలు

ఎక్కువ మాట్లాడితే

బదిలీ చేయిస్తా

క్వారీల్లో హద్దులు మీరి గ్రావెల్‌ తవ్వకాలు

అనుమతులు లేకుండా పట్టా భూముల్లో సైతం...

ప్రశ్నించిన అధికారులను బెదిరిస్తున్న ఓ క్వారీ నిర్వాహకుడు

ఎన్టీఆర్‌ జిల్లాలో 54 రాతి, గ్రావెల్‌ క్వారీల నిర్వహణ

రేయింబగళ్లూ వందల లారీల్లో భారీగా తరలిపోతున్న గ్రావెల్‌

గమ్మునుండు...గొడవ చేశావో నీ ఉద్యోగం ఊడపీకుతా...ప్రభుత్వం మాది. కిందా.. పైనా..అంతా మా వాళ్లే జాగ్రత్త.. అంటూ అధికారికి ఓ క్వారీ నిర్వాహకుడి బెదిరింపు. చంద్రబాబు ప్రభుత్వంలో క్వారీ నిర్వాహకుల అరాచకానికి హద్దుల్లేకుండా పోతోంది. నిత్యం వందల లారీల్లో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. అధికారులు అక్రమాన్ని అడ్డుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము మథనపడుతున్నారు.

జి.కొండూరు: జి.కొండూరు మండల పరిధి గడ్డమణుగు లోయ ప్రాంతంలో అటవీశాఖ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్లు 143, 26/2లోని అన్‌సర్వ్‌డ్‌ ఏరియా 720 ఎకరాలలో కోర్టు స్టే ఆర్డర్‌ ఉన్నప్పటికీ క్వారీలను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఏరియాలో క్వారీల నిర్వహణ ఆపాలని ప్రశ్నించిన అధికారులను ఓ క్వారీ నిర్వాహకుడు బెదిరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మాదే, గుంటూరు పార్లమెంట్‌ ప్రజా ప్రతినిధి మా వాడే...ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నుంచి బదిలీ చేయిస్తా అంటూ సదరు క్వారీ నిర్వాహకుడు రెచ్చిపోవడంతో అధికారులు సైతం చేసేది లేక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తమకిక ఎదురేలేదని భావించిన సదరు క్వారీ నిర్వాహకుడు ఇదే అదునుగా యథేచ్ఛగా గ్రావెల్‌, మెటల్‌ను భారీగా తరలిస్తున్నారు.

ఉత్తుత్తి దాడులు...

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీలపై మైనింగ్‌ శాఖ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి సీజ్‌లు చేయడం...ఫైన్‌లు వేయడం...వదిలేయడం తప్ప క్వారీల నిర్వాహకులు అనుమతులు పొందేదీ లేదు, అక్రమ తవ్వకాలు ఆగేది లేదు అన్నట్లుగా మండలంలో క్వారీల పరిస్థితి ఉంది. గత ఏడాది సెప్టెంబరు 4వ తేదీన కొండపల్లి పరిధిలో సాయి కృష్ణా ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో నిర్వహిస్తున్న క్రషర్‌కు జీఎస్టీ, మైనింగ్‌ అనుమతులను పొందలేదని తెలిసి క్రషర్‌తో పాటు క్రషర్‌లో ఉన్న ఐదు టిప్పర్‌ లారీలు, ఒక లోడర్‌, మెటీరియల్‌ను మైనింగ్‌ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటనకు ముందు రోజు సెప్టెంబరు 3వ తేదీన జి.కొండూరు మండల పరిధిలోని లోయ ప్రాంతంలో శ్రీ కనకదుర్గ స్టోన్‌ క్వారీలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకుని గ్రావెల్‌ తవ్వుతున్న ఒక పొక్లయిన్‌, రవాణా చేస్తున్న మూడు టిప్పర్‌ లారీలను, క్వారీని మైనింగ్‌ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఎక్కడా దాడులు గాని, సీజ్‌ చేయడాలు కాని చేసిన దాఖలాలు లేవు. కేవలం లెక్క చూపించుకోవడానికి ఉత్తుత్తి దాడులు చేయడం తప్ప, చిత్తశుద్ధితో దాడులు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవ రన్నా అధికారి నిజాయితీగా పనిచేయాలనుకున్నా చేసే పరిస్థితులు ఇక్కడ లేవని ఆయా గ్రామాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

పట్టా భూమిలో తవ్వకం

గడ్డమణుగు లోయ ప్రాంతంలో సర్వే నంబరు 14లో ఉన్న పట్టా భూమిని రైతు నుంచి లీజుకు తీసుకున్న ఓ క్వారీ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఇటీవల గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలు జరిపిన ప్రదేశం అటవీ భూమికి సమీపంలో ఉంది. అటవీ భూమికి 500 మీటర్ల పరిధిలో తవ్వకాలు చేపట్టాలంటే అటవీశాఖ నుంచి ఎన్‌ఓసీ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోనే రాతి, గ్రావెల్‌ క్వారీలు అధికంగా ఉన్నాయి. జి.కొండూరు మండల పరిధిలో తొమ్మిది క్వారీలు, కొండ పల్లి పరిధిలో ఆరు క్వారీలు, ఇబ్రహీంపట్నం, కంచికచర్లలో కలిపి 39 క్వారీల వరకు నిర్వహణ సాగుతోంది. అయితే అమరావతి నిర్మాణంలో భాగంగా రహదారులు, వివిధ నిర్మాణాలలో అవసరమైన గ్రావెల్‌, మెటల్‌, కంకర, వెట్‌ మిక్స్‌, డస్టు వంటి వాటిని ఇక్కడ నుంచే రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాన్ని ఆనుకొని క్వారీల నిర్వహణ సాగుతుండడంతో అసలు ఈ క్వారీల నిర్వహణకు ఎంత పరిధికి నిర్వాహకులు అనుమతి పొందారో, హద్దులు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టడం సాధ్యం కాదు. కొన్ని క్వారీలైతే అనుమతులు లేకుండా నిర్వహణ జరుగు తుండడంతో ఇష్టారాజ్యంగా హద్దులు మీరి గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. అటు వైపు కన్నెత్తి చూసే అధికారులు లేకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది లారీల్లో భారీగా గ్రావెల్‌ తరలిపోతోంది.

అంతులేని అరాచకం 1
1/1

అంతులేని అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement