లక్ష ఎకరాల్లో సేంద్రియ సాగు లక్ష్యం
ఎ.కొండూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో లక్ష ఎకరాల్లో సేంద్రియ సాగు లక్ష్యంగా కార్యాచరణ సిద్ధమైందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం నాగ సింధు స్పిన్నింగ్ మిల్ ఆవరణలోని మామిడి ఉద్యానవనంలో శనివారం ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు సేంద్రియ సాగుపై అవగాహన పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు.
డిజిటలైజేషన్‌తో కొనుగోలుదారులకు నమ్మకం
ఏ సర్వే నంబరులో ఎవరు సాగు చేశారు, ఏ విధమైన ఎరువులు వినియోగించారు తదితర వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలిసే విధంగా డిజిటలైజేషన్ చేయడం వలన మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులు కొనేవారికి నమ్మకం కలుగుతుందన్నారు. పామాయిల్ సాగులో అంతర పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయలు, మిరప వంటివి సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలపై కూడా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల వారీగా రైతులను గుర్తించి క్లస్టర్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సహకారం అందించడం, మార్కెట్ లింకేజీలను సమగ్రంగా అమలు చేయడం లక్ష్యంగా అధికారులు కృషిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇతర రైతులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు.
సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన
సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్‌పుట్స్, రీజెన్ అగ్రి కార్బన్ ప్రాజెక్టు, బయో ఎరువుల, పురుగుమందులు, రిసోర్స్ సెంటర్, మార్కెటింగ్, కార్బన్ క్రెడిట్స్ ట్రేసబులిటీ తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. దేశవాళీ వంగడాలు, జీవామృతం, గో ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక యంత్రపరికరాలు, వ్యవసాయ డ్రోన్లను కూడా ప్రదర్శనలో ఉంచారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, ప్రకృతి వ్యవసాయ అధికారి వై.శంకర నాయక్, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, రాష్ట్ర ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్, ఆర్గానిక్ ఉత్పత్తుల అథారిటీ డైరెక్టర్ వై.సతీష్, నాగసింథు స్పిన్నింగ్ మిల్ యజమాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.


