దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు

Feb 22 2026 7:00 AM | Updated on Feb 22 2026 7:00 AM

దుర్గ

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు

నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మనమిత్ర ద్వారా ఓపెన్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హుండీల ద్వారా భక్తులు రూ.2.89 కోట్ల మేర నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను శనివారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఇక కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లు 16 హుండీలో వేయడం గమనార్హం. 17 రోజులకు గాను 115 మూటల్లో కానుకలను లెక్కించగా, రూ.2,89,12,052, 171 గ్రాముల బంగారం, 880 గ్రాముల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. ఇక యుఎస్‌ఏకు చెందిన 820 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 40 డాలర్లు, మలేషియా రింగిట్‌లు 31, సింగపూర్‌ డాలర్లు 22, యుఏఈ దిర్హమ్స్‌ 105, ఆస్ట్రేలియా డాలర్లు 20, ఓమన్‌ రియాల్‌ 400, యూరప్‌ యూరోస్‌ 55, కెనడా డాలర్లు 505 లభించినట్లు పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లతో పాటు దేవదాయ శాఖ అధికారులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సౌర విద్యుత్‌ వినియోగదారులకు నగదు చెల్లింపు

మచిలీపట్నంటౌన్‌: కృష్ణా జిల్లా పరిధిలో సౌర విద్యుత్‌ వినియోగదారులు పవర్‌ గ్రిడ్డుకు అందించిన అదనపు యూనిట్లకు సంసంబంధించి నగదును వారి ఖాతాల్లో జమ చేసినట్లు విద్యుత్‌ శాఖ కృష్ణా జిల్లా పర్యవేక్షక ఇంజినీర్‌ వి.వి.చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4,636 మంది రూఫ్‌ టాప్‌ సోలార్‌ వినియోగదారులకు సోలార్‌నెట్‌ మీటరింగ్‌ విధానం ద్వారా గ్రిడ్డుకు అదనంగా సరఫరా చేసిన విద్యుత్‌ యూనిట్లకు రూ.33.45 లక్షలను వారి ఖాతాలకు శనివారం జమ చేశామన్నారు. 2025 నవంబర్‌ నెల వరకు ఈ మొత్తాన్ని జమ చేసినట్టు చెప్పారు. అలాగే డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు సోలార్‌నెట్‌ మీటరింగ్‌ విధానం ద్వారా గ్రిడ్డుకు అదనంగా సరఫరా చేసిన విద్యుత్‌ యూనిట్లకు ఆయా వినియోగదారులకు బిల్లులో సర్దుబాటు చేశామని తెలిపారు. 2026 మార్చి నుంచి అదనంగా సరఫరా చేసిన విద్యుత్‌ యూనిట్లకు గాను వినియోగదారులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. విద్యుత్‌ వినియోగదారులు సౌర విద్యుత్‌ వినియోగాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు అదనంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌కు నగదు పొందవచ్చునని ఆయన వివరించారు. జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారులు సౌర విద్యుత్‌ వినియోగానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఎగువ సన్నిధిలోని పానకాల స్వామివారి ముఖ మండపంలో శనివారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు భక్తులకు మాల వేసి దీక్షలు ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల సేవా ట్రస్ట్‌ చైర్మన్‌ తోట శ్రీనివాసరావు సుమారు 250 మంది భక్తులకు ఉచితంగా దీక్షా వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ ప్రతినిధులు వీరేంద్ర, రాఘవేంద్ర, భక్తబృందం ప్రతినిధులు కృష్ణ, రుద్రువినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా పొందవచ్చని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 95523 00009 నంబర్‌తో వాట్సాప్‌ ద్వారా హాల్‌టికెట్‌ పొందవచ్చని పేర్కొన్నారు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సైతం హాల్‌టికెట్‌ పొందొచ్చని వివరించారు.

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు 1
1/1

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement