సాక్షి, గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను చంద్రబాబే కాంగ్రెస్ పార్టీలోకి పంపారని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్రపన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి, ఈనాడు దాయడానికి ప్రయత్నించాయి. వైఎస్ జగన్.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు దాన్ని ఆపేయడం దుర్మార్గం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా ఇరుక్కున్నారో అందరికీ తెలుసు.
గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచింది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు బయటపడ్డాయి. చంద్రబాబే.. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకుంటానే ఉంటారు. చంద్రబాబు తీరు వల్ల రాయలసీమకు, కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అడిగితే తిరుమలను కూడా చంద్రబాబు ఇచ్చేస్తారేమో అంటూ ఘాటు విమర్శలు చేశారు.


