సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో మద్యం బాటిళ్లు దర్శమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. పోలీసు అతిథి గృహం ముందు పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం తిరుమలలో మద్యం పట్టుబడుతోంది.. అయినా భద్రత వ్యవస్థ మేల్కోవడం లేదు. అలిపిరి తనిఖీ కేంద్ర దాటుకొని నిత్యం మద్యం తిరుమలకు చేరుతోంది.
కాగా, గత ఏడాది డిసెంబర్‌లో భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేసింది. మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


