breaking news
TTD Vigilance Department
-
టీటీడీ వలలో పెద్ద దళారీ
సాక్షి, తిరుమల: టీటీడీ విజిలెన్స్ వలలో పెద్ద దళారీ పడ్డాడు. 46 మంది ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలతో భక్తులకు అధికమొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫార్సు లేఖ పై 36 సార్లు, అంబర్ పేట ఎమ్మెల్యే సిఫార్సు పై 23 సార్లు, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17 సార్లు, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు అమ్ముకున్నట్లు గుర్తించారు. ఏపీ మాజీ, ప్రస్తుత హోం మంత్రులనూ కూడా వదిలి పెట్టని దళారీ చారి.. వారి లేఖలపై కూడా టిక్కెట్లు పొందినట్లు తెలుస్తోంది. తిరుమలలో కల్లూరీ రాజు అనే మరో దళారీని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు ప్రజాపతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి పంపుతుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫార్సు లేఖలతో పేర్లు మార్చి పంపుతున్న అతడిని పట్టుకొని పోలీసులకు పిర్యాదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
భక్తులను మోసం చేస్తున్న కార్తీక్ అరెస్ట్
సాక్షి, తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమలకు వచ్చే అమాయకపు భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫొన్ నంబర్లను ట్రాప్ చేసి.. వారికి దర్శనం చేయిస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన తిరుమల టుటౌన్ పోలీసులు తెనాలిలో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తిరుమల టుటౌన్ సీఐ వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ చెడు వ్యసనాలకు అలవాటుపడి తిరుమలకు వచ్చి కొంతమందితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత తిరుమలకు వచ్చే భక్తులను మోసగించడమే పనిగా పెట్టుకున్నాడు. కార్తీక్‌తో సంబంధం కలిగిన తిరుమలలోని లడ్డు దళారులు.. మఠంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామ’ని తెలిపారు. -
అక్రమార్కులకు అభయహస్తం
* శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో రూ.వంద కోట్లు మింగారని తేల్చిన విజిలెన్స్ * విజిలెన్స్ విభాగం నివేదికను బుట్టదాఖలు చేసిన టీటీడీ ఉన్నతాధికారులు * అక్రమాల గుట్టును రట్టుచేసిన విజిలెన్స్ అధికారిపై బదిలీ వేటు! శ్రీవారి పేరుతో రూ.వంద కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులకు టీటీడీ ఉన్నతాధికారులు దన్నుగా నిలుస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేశారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు రట్టుచేసిన ఓ ఉన్నతాధికారిపై మంగళవారం బదిలీ వేటు వేయడం టీటీడీలో కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: నాలుగేళ్ల క్రితం లోక కల్యాణం కోసం దేశ, విదేశాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును టీటీడీ చేపట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును అక్రమార్జనకు అనువుగా మల్చుకోవడానికి అప్పటి ఓ ఉన్నతాధికారి పథకం వేశారు. ఆ క్రమంలోనే టీటీడీ సర్వీసు ఉన్న అధికారులను కాదని.. తనకు సమీప బంధువైన ఓ రిటైర్డ్ అధికారికి ఆ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడైనా శ్రీనివాస కల్యాణం నిర్వహణకు స్థానికంగా 60 శాతం ఖర్చులు భరించడానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే.. తక్కిన 40 శాతం వ్యయాన్ని టీటీడీ భరించేలా రూపొందించారు. శ్రీవారి కల్యాణం పేరుతో టీటీడీ ముద్రవేసుకుని భక్తులకు టికెట్లు విక్రయించకూడదని..ఆ పేరుతో విరాళాలు సేకరించకూడదని ఈ ప్రాజెక్టు నిబంధనలు రూపొందించారు. కానీ.. ఆ నియమనిబంధనలను టీటీడీ ఉన్నతాధికారులు తుంగలో తొక్కారు. దేశంలో బెంగళూరు, భద్రావతి, కుముదం, ముంబయి, చెన్నై, పాండిచ్చేరి, కాంచీ పురం తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇంగ్ల్లండ్ వంటి విదేశాల్లోనూ 175ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించారు. శ్రీనివాసకల్యాణం ప్రాజెక్టుకు టీటీడీ నిధులను రూ.3కోట్ల మేర మాత్రమే వెచ్చించి నట్లు అధికారవర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కానీ.. ఆ ముసుగులో శ్రీవారి కల్యాణోత్సవం పేరుతో టీటీడీ లోగోను ముద్రించిన టికెట్లను విక్రయించి.. విరాళాలు సేకరించి.. శ్రీవారి విగ్రహాలను విక్రయించి రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టారని టీటీడీ విజిలెన్స్ విభాగం తేల్చింది. ఏప్రిల్ 30, 2012న కర్ణాటకలో కుముదంలోని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో శ్రీనివాస కల్యాణోత్సవంలోనూ.. అక్టోబర్ 18, 2012న ముంబయిలో 3,500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఓ ప్రైవేటు ఆడిటోరియంలో నిర్వహించిన కల్యాణోత్సవంలోనూ టికెట్లను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ ఆధారాలను సేకరించింది. అమెరికాలో టెక్సాస్, న్యూజెర్సీ వంటి 20 నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణోత్సవాల్లోనూ టికెట్లను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. ఒక్కో కల్యాణోత్సవానికి సగటున రూ.మూడు కోట్ల వరకూ దోచుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. మే 27, 2012న అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో బాలాజీ ఆలయంలో కల్యాణోత్సవం పూర్తయిన తర్వాత శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలను రూ.1.50 కోట్లకు ఓ పారిశ్రామికవేత్తకు విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు ఇచ్చింది. ఇటీవల తుది నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. అక్రమార్కులకు దన్నుగా నిలుస్తూ విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేశారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు రట్టు చేసిన టీటీడీ వీజీవో హనుమంతుపై మంగళవారం బదిలీ వేటు వేశారు. తుది నివేదిక ఇచ్చిన కొద్ది రోజుల్లోనే టీటీడీ వీజీవోపై బదిలీ వేటు వేయడంపై టీటీడీ అధికారులు నివ్వెరపోతున్నారు.