‘ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు’ | Gadikota Srikanth Reddy Fires On Chandrababu Over His Negligence On Rayalaseema, Watch Video Inside | Sakshi
Sakshi News home page

‘ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు’

Jan 4 2026 11:41 AM | Updated on Jan 4 2026 3:06 PM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu Neglect Of Rayalaseema

సాక్షి, హైద‌రాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా.. సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాటలతో  చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కి  చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు.

శాసనసభ సాక్షిగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చంద్రబాబు తప్పుకి నిష్కృతి లేదని ధ్వజమెత్తారు. కేవలం స్వప్రయోజనాల కోసమే పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్ర‌బాబే రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ నిలిపివేశాడని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటి గండమేనన్న శ్రీకాంత్ రెడ్డి, ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడ్డంలో విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయ‌ల‌సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు. 
ఇంకా ఆయన ఏమన్నారంటే..

రాయ‌ల‌సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధిపై చంద్ర‌బాబు మొద‌టి నుంచీ వ్య‌తిరేక‌త క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్‌, లా యూనివ‌ర్సిటీ, హైకోర్టుల‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించుకుపోయాడు.  రాయ‌ల‌సీమ ప్రయోజ‌నాల కోసం ఈ ప్రాంత నాయ‌కులు త‌క్ష‌ణం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. వైయ‌స్ జ‌గ‌న్ ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తాప‌త్ర‌య‌ప‌డి రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆయ‌న‌తో మాట్లాడి ప్రాజెక్టును నిలుపుద‌ల చేయించిన‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌ట‌మే కాకుండా త‌న మాట‌ల‌పై నిజ‌నిర్ధార‌ణ‌కు అన్ని పార్టీల నుంచి నాయ‌కుల‌ను పంపిస్తాన‌ని కూడా స‌వాల్ చేశాడు.

చంద్ర‌బాబు కార‌ణంగానే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు ఆగిపోయింద‌ని తేట‌తెల్లం అయ్యింది. చంద్రబాబు చేసిన పాపానికి రాయ‌ల‌సీమ ప్రాంతంతో పాటు ప్ర‌కాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా ప్ర‌జ‌లు సైతం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌కు చంద్ర‌బాబే మ‌ర‌ణశాస‌నం రాశాడ‌ని స్పష్టంగా తేలిపోయింది కాబ‌ట్టి, రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌యోజ‌నాల కోసం ఈ ప్రాంతానికి చెందిన నాయ‌కులు త‌క్ష‌ణం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. ప‌ద‌వులు ముఖ్యంకాదు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా ప‌నిచేయాలి. ఇప్ప‌టికైనా చేసిన త‌ప్పుకి బాధ్య‌త వ‌హించి రాయ‌ల‌సీమ ప్రాజెక్టును చంద్ర‌బాబు త‌క్ష‌ణం పూర్తి చేసేవర‌కు వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు.

చంద్ర‌బాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా..
చంద్ర‌బాబు ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న ప్ర‌తిసారీ పైనున్న రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు క‌ట్టుకుంటూనే ఉన్నాయి. గ‌తంలో కర్నాట‌క రాష్ట్రం ఆల్మ‌ట్టి ఎత్తు పెంచుతుంటే చంద్ర‌బాబు మౌనం వ‌హించాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఎత్తు పెంచుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ ముందు ఏపీ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించ‌డంలోనూ చంద్ర‌బాబు ఫెయిల‌య్యాడు. అడుగ‌డుగునా త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు తాక‌ట్టు పెడుతూనే ఉన్నాడు. ఇలాంటి చంద్ర‌బాబును గెలిపించినందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గాల‌ని వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఆలోచించింది. తెలంగాణ నాయ‌కులు కూడా రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల గురించి ఆలోచించాలి. పాల‌మూరు- రంగారెడ్డి చేసుకుంటూ ఏపీలో రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టుకు మ‌ద్ధ‌తివ్వాలి. క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డి పోల‌వ‌రం ప్రాజెక్టును నాశ‌నం చేస్తే, వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక‌నే కేంద్రంతో మాట్లాడి మ‌ళ్లీ గాడిన‌పెట్టారు. నిధులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టును వ్యూహాత్మ‌కంగా పక్క‌న‌పెట్టి బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తెర‌పైకి తెచ్చిన చంద్ర‌బాబు, కొన్ని రోజులు హ‌డావుడి చేసి దాన్ని కూడా అటకెక్కించాడు.

నీటి హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ స్కీం
శ్రీశైలం జలాశయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం.

కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్‌ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్‌ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి నెల‌కొంటోంది.

రోజూ 3 టీఎంసీలు త‌ర‌లించేలా..
ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల నుంచి రాయ‌ల‌సీమను కాపాడుకునేంద‌కు రోజుకు 3 టీఎంసీలు త‌రలించేలా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నాటి సీఎం వైఎస్‌ జ‌గ‌న్ ప్రారంభించారు. ప్రాజెక్టుకు సంబంధించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కూడా తీసుకొచ్చారు. కానీ ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేవ‌నే కార‌ణం చూపెట్టి చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌ను ప‌క్క‌న పెట్టేసింది. చంద్ర‌బాబు త‌న కేసుల‌కు భ‌య‌ప‌డి పూర్తికావొచ్చిన ద‌శ‌లో ఉన్న ప్రాజెక్టును నిర్ధాక్షిణ్యంగా ప‌క్క‌న‌పెట్టి రాయ‌లసీమకి మ‌ర‌ణ‌శాస‌నం రాశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింది.

చంద్ర‌బాబు చేసిన ఈ పాపానికి ఏకంగా రాజ‌కీయాల నుంచి వైదొలిగినా చేసిన పాపం పోదు. రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబు ఎప్పుడూ ద్వేష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. వైయ‌స్సార్సీపీ తీసుకొచ్చిన లా యూనివ‌ర్సిటీని, హైకోర్టును అమ‌రావ‌తికి త‌ర‌లించాడు. కేంద్రం అనంత‌పురంకి ఎయిమ్స్ ఆస్ప‌త్రిని కేటాయిస్తే మంగ‌ళ‌గిరికి త‌ర‌లించుక‌పోయాడు.

తెలంగాణలో పాల‌మూరు జిల్లా క‌రువును పార‌దోల‌డానికి అక్క‌డి పాల‌కులు ప్ర‌య‌త్నిస్తుంటే చంద్ర‌బాబు మాత్రం రాయ‌ల‌సీమ‌లో పుట్టి ఈ ప్రాంతానికి తీవ్ర‌మైన అన్యాయం చేస్తున్నాడని  శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ జ‌గ‌న్, రేవంత్‌రెడ్డిల మాదిరిగా తాము ప్రాతినిథ్యం వ‌హించే ప్రాంతానికి మేలు చేయాల‌ని ఆలోచించ‌కుండా, చంద్ర‌బాబు నిర్ధాక్షిణ్యంగా రాయ‌ల‌సీమ‌ను చంపేస్తున్నాడని ఆక్షేపించారు. ముఖ్య‌మంత్రిగా ఉండి రాష్ట్ర హక్కుల విష‌యంలో రాజీ ప‌డడం ద్వారా... ఏకంగా రాయ‌ల‌సీమ‌ను ఎడారిగా మార్చే కుట్ర‌కు తెర‌లేప‌డంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement