కాకినాడ క్రైం / జగ్గంపేట: జగ్గంపేట మండలం సోమవరం జాతీయ రహదారిపై ఈ నెల 8న కారు ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన కూండ్రపు దుర్గా చైతన్య (17) కాకినాడ జీజీహెచ్‌లో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీనితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదానికి గురైన చైతన్యకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన కొద్దిసేపటికే కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, ఆమెను తొలుత అత్యవసర విభాగంలో ఉన్న సీఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆర్‌ఐసీయూ–2లో చేర్చారు. కాళ్లు రెండూ ఛిద్రమవడంతో రెండు రోజుల పాటు అక్కడే ఉంచి చికిత్స అందించారు. తీవ్ర గాయాలు కావడంతో కాలి నుంచి ఇన్‌ఫెక్షన్ శరీరానికి వ్యాప్తి చెందింది.
ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆదివారం దుర్గాచైతన్య ఎడమ కాలిని తొలగించారు. ఎమర్జెన్సీ ఓటీలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి పూర్తయ్యింది. అనంతరం ఆమెను ఆర్‌ఐసీయూ–1కి తరలించి పరిశీలనలో ఉంచారు. రాత్రి 2 గంటల సమయంలో దుర్గాచైతన్య ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చైతన్య చివరికి ప్రాణాలు విడిచింది. ముక్కుపచ్చలారని వయసులో చేయని తప్పుకు ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన బాలిక దయనీయ స్థితి వైద్య సిబ్బందితో కన్నీళ్లు పెట్టించింది.
ఇర్రిపాకలో విషాదం
నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాచైతన్యది జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం. ఆమె తండ్రి సన్యాసిరావు, తల్లి కుమారి. వీరికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాచైతన్య పెద్ద కుమార్తె. సన్యాసిరావు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను తనలా కాకుండా ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని ఎంతో ఆశపడేవాడు. అందుకే కాకినాడలో పెద్ద కుమార్తెను నర్సింగ్ కోర్సులో చేర్పించాడు. ఆమె ఉద్యోగంలో స్థిరపడితే తన కాళ్లపై తాను నిలబడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి దుర్గాచైతన్య మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


