విశాఖతోపాటు కర్ణాటక, గోవా రాష్ట్రాలకు పోలీసు బృందాలు
కిడ్నీ స్వీకరించింది గోవా వ్యక్తి
ఆపరేషన్ చేసినది బెంగళూరు డాక్టర్
కీలక సూత్రధారులు ప్రభుత్వ ఉద్యోగులే?
కిడ్నీ మార్పిడి చేసిన ఆస్పత్రి ప్రారంభమైనది ఏడాదిన్నర కిందటే..
అప్పటి నుంచి ఎన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశారనే దానిపై విచారణ
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు మూడు రాష్ట్రాల్లో విస్తరించినట్టు తెలుస్తోంది. కిడ్నీ ఇచ్చినది విశాఖ జిల్లా యువతి, దానిని అమర్చింది గోవాకు చెందిన వ్యక్తికి, ఈ ఆపరేషన్ చేసినది బెంగళూరుకు చెందిన వైద్యుడని పోలీసులు గుర్తించారు.
ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? ఎప్పటి నుంచి ఉంది? ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌కి అనుమతిలేని ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎలా చేశారు? ఇందులో అనుభవం కలిగిన వైద్యుల అవసరం కాబట్టి వాళ్లు ఎవరు? అన్న అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని విశాఖపట్నం సహా మరికొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక, గోవా రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి.
విశాఖతో మదనపల్లెకు లింకు ఎలా కుదిరింది?
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సాడి యమున (29) అనే యువతి కిడ్నీ తీసి గోవాకు చెందిన వ్యక్తికి అమర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యూరాలజీ వైద్యుడు పార్థసారథి అని గుర్తించారు. ఆయన కోసం గాలిస్తున్నారు.
కిడ్నీ స్వీకరించినది గోవా వ్యక్తి.. అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కిడ్నీ సేకరించే విషయంలో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాకు చెందిన యువతికి, ఆపరేషన్ చేసిన ఆస్పత్రి ఉన్న రాయలసీమలోని మదనపల్లె ముఠాకు ఎలా లింకు కుదిరింది? వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు.
ఈ కేసులో కీలక నిందితుడైన వైద్య, ఆరోగ్యశాఖలో జిల్లా డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు నుంచి వివరాలను రాబడితేనే గుట్టంతా వీడుతుందని భావిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేసిన మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాదిన్నర కిందట ప్రారంభించారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఇప్పటిదాకా ఎన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌లు చేశారో ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసేవారే కీలకం?
ఈ వ్యవహారంలో వైద్య, ఆరోగ్యశాఖలో జిల్లా డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు, కదిరి, మదనపల్లె ప్రభుత్వాస్పత్రుల్లోని డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న బాలు, మెహరాజ్ కీలకమని పోలీసులు గుర్తించారు. సాడి యుమున మృతిచెందకుండా ఉంటే కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చేదికాదు. కిడ్నీ రాకెట్ ముఠా ఆమె మరణించిన తర్వాత కూడా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించి, విషయం బయటకు రాకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.
మరోవైపు యమునతో ఎమిదేళ్లుగా సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఈ విషయాలన్నీ తెలిసే కిడ్నీ మార్పిడి కోసం మధ్యవర్తులైన పిల్లి పద్మ, సత్యతో ఆమెను పంపినట్టు పోలీసులు గుర్తించారు. క్రైమ్ నంబర్ 179/2025గా నమోదైన కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. డాక్టర్ ఆంజనేయులును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎఫ్‌ఐఆర్ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.


