నిందితుల్లో అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ఎస్ ఆంజనేయులు
ఈ కేసుకు పలు రాష్ట్రాలతో లింకులు
మదనపల్లె డీఎస్పీ మహేంద్ర వెల్లడి
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర చెప్పారు. అరెస్టయిన వారిలో అన్నమయ్య జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) కె.ఆంజనేయులు ఉన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శనివారం మీడియాకు వెల్లడించారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెంకు చెందిన సాడి యమున (29) నుంచి ఈ నెల 9న మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కిడ్నీని తొలగించగా..ఆ మరుసటి రోజున ఆమె మృతి చెందింది. ఆమె తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి ఆరుగురిని అరెస్ట్ చేశామని, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు.
మధ్యవర్తులతో మదనపల్లెకు..
సాడి యమున (29)కు ఆనందపురం మండలానికి చెందిన సూరిబాబు (45)తో సాన్నిహిత్యం ఉంది. యమునకు ఆరి్థక ఇబ్బందులు ఉండటంతో కిడ్నీ ఇస్తే కష్టాలు తీరిపోతాయని సూరిబాబు చెప్పాడు. దీంతో మధ్యవర్తులైన విశాఖకు చెందిన కాకర్ల సత్య (43), పిల్లి పద్మ (45)తో ఈ విషయం చెçప్పడంతో వీరు సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్ (37), మదనపల్లె ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ మేనేజర్ బాలరంగడు(35) దృష్టికి తీసుకెళ్లారు.
వీరు మదనపల్లెలోని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆంజనేయులను కలిసి కిడ్నీ ఇచ్చేవారు, స్వీకరించే వారున్నారని, పెద్ద మొత్తంలో నగదు వస్తుందని చెప్పగా..ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు నిర్ణయించారు. ఈ ఆపరేషన్ చేసేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్, అతని సహాయకులు ఇద్దరు పాల్గొన్నారని, డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈనెల 9న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో యమునకు ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించగా యమున మృతి చెందిందని చెప్పారు.
తాము జరిపిన దర్యాప్తులో మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో యమునతోపాటు మరో మహిళ నుంచి కిడ్ని తొలగించి మరొకరికి అమర్చినట్లు డీఎస్పీ చెప్పారు. వీరిలో యమున మృతి చెందగా మరో మహిళ కోలుకుందని, యమున కిడ్నీ స్వీకరించిన వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.
ఇంకా ఎంతమంది నుంచి కిడ్నీలు తొలగించారు, వాటిని ఎవరికి అమర్చారన్న వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్లు చేసిన బెంగళూరుకు చెందిన వైద్యుడిని అరెస్ట్ చేయడానికి ప్రయతి్నస్తున్నట్టు చెప్పారు. ఈ డాక్టర్ మదనపల్లెకు వచ్చి ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌లు చేస్తున్నట్లు చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లో లింకులు...
మదనపల్లె కిడ్నీరాకెట్ వ్యవహారంలో పెద్దమొత్తంలో చేతులు మారినట్లు డీఎస్పీ చెప్పారు. కిడ్నీలు స్వీకరించిన వారి నుంచి అందిన మొత్తంలో అందరూ కలిసి వాటాలు వేసుకున్నారని తెలిపారు. ఈ కేసు లింకులు కర్ణాటక, గోవా, తెలంగాణ, ఏపీల్లో ఉన్నాయని, దీనిపై 4 పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల ఫోన్లను, సీసీ కెమెరా సీడీఆర్‌లను స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు చెప్పారు.


