సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు గ్రామాలకు ఎన్నికలే లేకుండా పోయాయి.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్‌నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు. కారణం ఆ పల్లెల్లో గిరిజనులు లేకున్నా.. ఏజెన్సీ నిబంధనల ప్రకారం సర్పంచి స్థానాలను గిరిజనులకే కేటాయించాల్సి రావడం.
ఇక చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు గోకారం రిజర్వాయర్ ముప్పు తగ్గించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు లేకుండా పోయాయి.
ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు.


