పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు రిజర్వేషన్ల జాబితాలు
నేడు ఎన్నికల సంఘానికి జాబితాలు... కొన్ని జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్ జారీ
పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాల ప్రదర్శన
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ
ఎన్నికలకు సిద్ధమని తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల కసరత్తును కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓలు) పూర్తి చేశారు. జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను ప్రకటించారు. రిజర్వేషన్ల వివరాలను ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని పంచాయతీరాజ్‌శాఖ జారీ చేసిన జీవో 46లోని మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్నిచోట్ల గ్రామాలవారీగా జాబితాలు ప్రకటించగా మరికొన్ని చోట్ల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి జిల్లాలవారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాలు హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో అందజేస్తున్నారు.
డీపీఓలు స్వయంగా వచ్చి సీల్డ్‌కవర్లో రిజర్వేషన్ల జాబితాలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి రిజర్వేషన్ల జాబితాలు చేరగా మరికొన్ని జిల్లాల నుంచి సోమవారం అందనున్నాయి. అన్ని జిల్లాల నుంచి జాబితాలు వచ్చాక వాటిని పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) పీఆర్‌అధికారులు నేడు అందజేయనున్నారు.
కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్‌నోటిఫికేషన్లు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని హైకోర్టుకు పీఆర్, ఆర్డీశాఖ వివరించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తి చేశామని తెలియజేయనుంది.
తేలిన ఓటర్ల లెక్క
రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల లెక్క కూడా తేలింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 1,67,03,173 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 81,65,899 మంది, మహిళా ఓటర్లు 85,36,770 మంది ఉండగా ఇతరులు 504 మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలవారీగా వార్డుల విభజన, ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి అధికారులు పరిష్కరించారు. ఆదివారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఫొటోలతో కూడిన తుది ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1,12,474 పోలింగ్‌స్టేషన్లు, 15,522 పోలింగ్‌ప్రాంతాలను గుర్తించారు. రాష్ట్రంలో 565 మండలాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్‌కు అధిక ప్రాధాన్యమివ్వనుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహణ కోసం జిల్లాలవారీగా టెండర్లు ఆహ్వానించింది. ఈ మేరకు జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. జిల్లాలవారీగా వెబ్‌కాస్టింగ్‌సెంటర్ల వివరాలు కూడా పీఆర్‌కమిషనరేట్‌కు చేరినట్లు తెలిసింది.


