సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.
మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్‌ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఐఏఎస్ రాణి కుముదిని దేవి మీడియా ముఖంగా వెల్లడించారు.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
- ఫేజ్ 1లో కోసం.. నవంబర్ 27 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 11న పోలింగ్
- ఫేజ్2 కోసం.. 30 నవంబర్ నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 14న పోలింగ్
- ఫేజ్3 కోసం.. డిసెంబరు 3 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 17న పోలింగ్


