కాజీపేట : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎంతో కాలంగా గ్రామానికి మొదటి పౌరుడిగా ఎంపిక కావాలని ఎదురు చూస్తున్న కొందరికి ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు నిరాశను మిగిల్చాయి. ఇదే రిజర్వేషన్లు మరికొంత మందికి తాము పోటీచేసే అవకాశం లేకున్నా తమ జీవిత భాగస్వాములకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాయని సంబుర పడుతున్నారు. ధర్మసాగర్ మండల కేంద్రం ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాలకు చెందిన యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువకులు తమ భార్యలతో పోటీ చేయించేందుకు సమయత్తమయ్యారు. ముగ్గురు ఒకే రోజు తమ శ్రీమతులతో నామినేషన్ దాఖలు చేయించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓటరు దేవుళ్లు ఎవరి పక్షాన నిలబడి ఆశీర్వదిస్తారో వేచిచూడాల్సిందే.


