ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్‌ | CM Revanth Reddy to inaugurate adventure eco park at Kothwalguda: telangana | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్‌

Mar 7 2026 5:08 AM | Updated on Mar 7 2026 5:08 AM

CM Revanth Reddy to inaugurate adventure eco park at Kothwalguda: telangana

పార్కును పరిశీలిస్తున్న సీఎం

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుగులు

ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారనున్న నగరం  

కొత్వాల్‌గూడ ఎకోపార్కును ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 

బుద్వేల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

సాక్షి, హైదరాబాద్‌ /శంషాబాద్‌: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్‌ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ వంటి వారి సంస్థలు హైదరాబాద్‌కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించిన కొత్వాల్‌గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.

బుద్వేల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్, శంషాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ టెరి్మనల్, బుద్వేల్‌ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు.

 హైదరాబాద్‌ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్‌ హయాంలో హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్‌ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. 

మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లు, రేడియల్‌ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్‌ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్‌ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.

బుద్వేల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ ప్రత్యేకతలు  
అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్‌ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్‌ఆర్‌ను రేడియ­ల్‌ రోడ్‌–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటా­యి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్‌ రోడ్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్‌లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది.  

కొత్వాల్‌గూడ ఎకో–హిల్‌ పార్కు 
హిమాయత్‌సాగర్‌ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్‌పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్‌ నగరానికి గ్రీన్‌ లంగ్‌స్పేస్‌గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ బోర్డ్‌ వాక్, 400 సీట్ల ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్‌ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్‌లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement