నేను అందరివాడిని | Revanth Reddy Thanks Madiga Employees For Support: Telangana | Sakshi
Sakshi News home page

నేను అందరివాడిని

Mar 7 2026 4:35 AM | Updated on Mar 7 2026 4:35 AM

Revanth Reddy Thanks Madiga Employees For Support: Telangana

సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న అడ్లూరి లక్ష్మణ్, రాజనరసింహ, సంపత్, ఖాసిం, కావ్య తదితరులు

మాదిగ ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్‌రెడ్డి 

పేదల ఆశయ సాధనకు తప్పకుండా కృషి చేస్తా 

బర్రెలు, గొర్రెలిస్తే కాదు.. ఉన్నతస్థాయికి ఎదిగినప్పుడే మాదిగలు అభివృద్ధిలోకి వచ్చినట్లు 

ప్రభుత్వం వద్ద పంచేందుకు భూములు లేవు... నాణ్యమైన విద్య అందిస్తాం 

మీ జాతి బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి

సాక్షి, హైదరాబాద్‌: బలహీనుల పక్షాన నిలబడే మొదటి వ్యక్తిగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వారికి అండగా నిలిచి వారి లక్ష్య సాధన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ, సతీశ్‌ మాదిగ తదితరులు కలిసినప్పుడు అండగా నిలిచానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీలో తొలి ప్రకటన చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు మాదిగ ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కృతజ్ఞత సభ నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

వర్గీకరణపై వడివడిగా కదిలాం.. 
‘ఎస్సీ వర్గీకరణ అంశం దశాబ్దాలపాటు నలిగింది. ఎలాగైనా వర్గీకరణ సాధించాలన్న తపనతో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన నేను మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌ కుమార్‌తోపాటు నన్ను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వం.. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతోపాటు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.

అలాగే వన్‌ మ్యాన్‌ కమిషన్‌ను నియమించి ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా వర్గీకరణ అమలు చేసింది. ఇలా అన్నీ వేగంగా, విజయవంతంగా పూర్తి చేశాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ వీలైనంత వరకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పదోన్నతులు, ఉన్నత విద్య, లిడ్‌క్యాప్‌ భూముల పరిరక్షణ లాంటి సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదు.

ప్రభుత్వం మీ సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరే ఆపాలి. మీరే నాకు అండగా నిలవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి’అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్‌ అంబాసిడర్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. 

మిత్రధర్మం... పేదల పక్షం... 
‘మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు అందరికీ ఇష్టమే. కానీ నాకు కర్ణుడు, బార్బరికుడంటే అభిమానం. కర్ణుడు మిత్రధర్మాన్ని చివరి వరకు పాటించాడు. ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు మాత్రం బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా బలహీనుల ఆశయ సాధన, సమస్యల పరిష్కారంలో ముందుంటా. వర్గీకరణ విషయంలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన నిలబడ్డా. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తి చూపి అండగా నిలబడ్డారు’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 

నా శక్తి ఉన్నంత వరకు సాయం చేస్తా.. 
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పంచేందుకు భూములు లేవు. అలాగే ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖలో ఉన్న మాదిగ జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం. అందుకే నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్‌ చార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. గత ప్రభుత్వం పేదలకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చామని చెప్పింది. చెప్పులు కుట్టుకొమ్మంది.

బర్రెలు, గొర్రెలు, చేపలతో కాదు.. మీ జాతి బిడ్డలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి. ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్‌రామ్‌ కుమార్తె మీరాకుమార్‌ ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో నేనూ పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నన్ను రేవంత్‌ మాదిగ అన్నారు. ఇంకొన్ని పేర్లతోనూ పిలిచారు. నన్ను ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని’అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఎనిమిది నెలల్లోనే పూర్తి: మంత్రి దామోదర 
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను 8 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తదుపరి నిమిషమే సీఎంకు అసెంబ్లీలో సమాచారం ఇచ్చానని, వెంటనే సీఎం స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేశారని.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్గీకరణతో ఉద్యోగాలు, విద్యలో మాదిగలకు అవకాశాలు పెరుగుతాయని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సబ్‌ప్లాన్‌ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.

గ్రూప్‌–1 ఉద్యోగాలు వచ్చాయి: అడ్లూరి 
ఎస్సీ వర్గీకరణ అమలుతో అత్యంత పేద కుటుంబాలకు గ్రూప్‌–1 లాంటి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వెల్లడించారు. వర్గీకరణ వల్లే 778 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు, ఇంజనీరింగ్‌ సీట్లు వచ్చాయన్నారు. దశాబ్దాల క్రితం కొట్లాడిన దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement