breaking news
Kothwalguda
-
ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ /శంషాబాద్: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి వారి సంస్థలు హైదరాబాద్‌కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన కొత్వాల్‌గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శంషాబాద్ హైస్పీడ్ రైల్ టెరి్మనల్, బుద్వేల్ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ ప్రత్యేకతలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్‌ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్ఆర్ను రేడియల్ రోడ్–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటాయి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్వాల్‌గూడ ఎకో–హిల్ పార్కు హిమాయత్‌సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్ నగరానికి గ్రీన్ లంగ్‌స్పేస్‌గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ బోర్డ్ వాక్, 400 సీట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్‌లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఎకోపార్కు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన కొత్వాల్‌గూడ ఎకో పార్కు (Kothwalguda Eco Park) ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. హిమాయత్‌సాగర్‌కు చేరువలో, ఔటర్‌రింగ్ రోడ్డు అంచుల్లో ఆకుపచ్చ అందాలతో పార్కు రూపుదిద్దుకుంటోంది. 2022 అక్టోబర్‌లో 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.75 కోట్ల అంచనాలతో ప్రభుత్వం ఎకో పార్కు నిర్మాణం చేపట్టింది. ఎన్నో వైవిధ్యభరితమైన ప్రత్యేకతలతో ఏర్పాటు చేస్తోన్న కొత్వాల్‌గూడ ఎకోపార్కును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితర ఉన్నతాధికారులు శుక్రవారం సందర్శించారు.పంద్రాగస్టు నాటికి పార్కును ప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. పార్కు ప్రవేశ ద్వారం వద్ద వెదురు అల్లికలతో అందమైన ఆర్చ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సహజత్వం ఉట్టిపడేలా ఈ ఆర్చ్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వెదురును థాయ్‌లాండ్ నుంచి తెప్పించనున్నారు. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వెదురు అల్లికల ఆర్ట్ పని పూర్తి కాగానే పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు.. ⇒ ఇటు ఐటీ కారిడార్ల నుంచి అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న వివిధ కాలనీలు, ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఒక అద్భుతమైన ఆటవిడుపు.⇒ అందమైన కాలక్షేపంగా ఎకో పార్కు కనువిందు చేయనుంది. పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి వేడుకలకు అవసరమైన వేదికలు, లగ్జరీ సదుపాయాలతో దీన్ని రూపొందించారు.⇒ పార్కులో ఏర్పాటు చేసిన ఏవియరి (పక్షుల గ్యాలరీ) సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. రకరకాల పక్షుల కిలకిలలతో ఆహ్లాదాన్ని పంచేవిధంగా దీన్ని ఏర్పాటు చేశారు.⇒ 2.5 కి.మీ.లతో ఎలివేటెడ్ వాక్ వేలను నిర్మించారు. నగరవాసులు ఉదయం, సాయంత్రం ఈ వాక్‌వేలపై నడకకు వెళ్లవచ్చు. విశాలమైన పచ్చిక బయళ్లతో పాటు, అందమైన పూల వనాలను ఏర్పాటు చేశారు. బటర్‌ఫ్లై పార్కు మరో ప్రత్యేకత. సీజనల్ ఉద్యాన వనాలు మరో ప్రత్యేకత. చదవండి: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి! -
ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుపై వేటు
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వేటువేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న 55 మందిపై శాఖపరమైన అంతర్గత విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా గతేడాది డిసెంబర్ 25 నుంచి గత శుక్రవారం మధ్య వరకు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వీరిలో ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైన మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు కూడా ఉన్నారు. వేటుపడిన వారిలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు. బాధితులు, సాక్షులపై ప్రభావం లేకుండా... సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులపై శాఖపరమైన విచారణ జరిపిన తర్వాత ఈ తరహా చర్యలు తీసుకుంటారు. వనస్థలిపురంలో కేసు నమోదైన ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారశైలి దృష్ట్యా విచారణ సమయంలో సాక్షులు, బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో లాలాగూడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాసరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ అదనపుకట్నం కోసం భార్యను వేధించడంతోపాటు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపారు. దీంతో వీరిద్దరినీ కూడా డిస్మిస్ చేస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరు పోలీసులపైనా చర్యలు ఈ ముగ్గురితోపాటు పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మరికొందరిపైనా కఠినచర్యలు తీసుకున్నారు. ఓయూ ఠాణాలో ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేసిన బి.నర్సింహ ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్ఎస్సై గొల్ల నిరంజన్పైనా తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తమ్మీద ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక సబ్–ఇన్స్పెక్టర్, 11 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా మరొకరు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రిజర్వ్డ్ కేటగిరీలో ఇన్స్పెక్టర్, హెడ్–కానిస్టేబుల్, 19 మంది కానిస్టేబుళ్లుసహా మరొకరిపై వేటు పడింది. వీరిలో 13 మంది ప్రొబెషన్‌లో ఉండగానే తొలగించబడ్డారు. వీరిలో కొందరు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, హత్య తదితర కేసుల్లో నిందితులుగా ఉండటం, అవినీతి చర్యలకు పాల్పడటం సహా ఇతర అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఖాకీ దుస్తులు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు) -
బోనులో నైట్ సఫారీ!
సాక్షి, సిటీబ్యూరో: తొమ్మిది రకాల అడవులు..140 జాతుల జంతువులు..సింగపూర్ నైట్ సఫారీ పార్కునే మించేలా..ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించేలా కొత్వాల్‌గూడలో 125 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేయాలనకున్న నైట్ సఫారీ పార్కు ప్రాజెక్టు అటకెక్కినట్లు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. గతేడాది జూన్ 24న బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కొత్వాల్‌గూడలోని స్థలాన్ని పరిశీలించి మరో రెండు నెలల్లో డిజైన్లు సమర్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు అంశం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఆసక్తి కనబరిచినా తదనంతర పరిస్థితుల్లో దీన్ని పట్టించుకునేవారే కరువవడంతో ఆ ఊసే లేకుండా పోయింది. అయితే ఇప్పటికైనా నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఇటు హెచ్ఎండీఏ, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో పాటు హిమాయత్‌సాగర్ ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుందంటున్నారు. నేపథ్యమిదే... సింగపూర్ నైట్ సఫారీ పార్కులో ఉన్నట్టుగానే ట్రామ్ లేదా ట్రాయ్ ట్రైన్ ద్వారా సందర్శకులు దాదాపు గంటపాటు జంతువులను రాత్రి సమయాల్లో చూసే వీలుకల్పించనున్నారు. చిమ్మచీకటిలో కలియ తిరుగుతూ వన్య ప్రాణుల కదలికలను దగ్గరి నుంచి చూసే అనుభూతిని కలిగించనున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటుచేసిన ప్రత్యేక లైట్ల వెలుగులో జంతువులు తచ్చాడుతూ అటుఇటు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఈ లైట్ చాలా డిమ్‌గా ఉంచనున్నారు. సహజంగా ఏర్పడిందా అన్నట్టుగా సృష్టించే ఈ ఆడవిలో దాదాపు 140 జాతులకు చెందిన జంతుజాలం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దాదాపు 1200 జంతువులు తీసుకురావాలని నిర్ణయించారు.. విదేశీ జంతువులతో పాటు స్థానికంగా ఉండే జంతువులు నక్కలు, జీబ్రాలు, జింకలు, కోతులు, కొండెంగలు, సింహాలు, కుందేళ్లు...ఇలా వివిధ రకాల జంతువులను తీసుకొస్తామని అధికారులు చెప్పారు. అలాగే మధ్యమధ్యలో నీళ్లు జాలువారేలా ఏర్పాట్లు, అక్కడక్కడ ఏర్పాటుచేసే చిన్నచిన్న కుంటల్లో మొసళ్లు కూడా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే సింగపూర్ నైట్ సఫారీ పార్క్ ముందు గిరిజనుల ప్రదర్శనలు ఉన్నట్టుగానే ఇక్కడ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు, బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్‌లు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే సందర్శకులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు రెస్టారెంట్లు కూడా ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచించారు. రాత్రి సమయాల్లో నైట్ సఫారీ చూసేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికైనా కదలిక వచ్చేనా... గతేడాది జూన్‌లో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు తెరపైకి వచ్చినా తదనంతర రాజకీయ పరిస్థితులతో ఆ అంశం కనుమరుగైంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగడంతో హెచ్ఎండీఏ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిద్వారా మంచి ఆదాయం రావడంతో పాటు ప్రపంచస్థాయిలో పర్యాటకంగా హైదరాబాద్‌కు మరింత మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. -
‘ఎనిమీ’తో ఆందోళన వద్దు
శంషాబాద్ : కొత్వాల్‌గూడ గ్రామస్తులు తమ భూములకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సురేష్‌తో కలిసి ఆయన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే కృషి చేస్తుందన్నారు. బోగస్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన లావాదేవీలతో గ్రామస్తులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. సదరు సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ ప్రజలకు అనుగుణంగానే అధికారులు ఇప్పటికే పలుమార్లు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. అనవసర అపోహలకు గురై భూములను విక్రయించవద్దని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఇప్పటికి రెండు సార్లు సమీక్ష... ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు జరిగాయని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని 1–174 సర్వే నెంబర్లలో మొత్తం 2700 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇందులో 286 ఎకరాల ప్రభుత్వ భూమి పోను, 685 ఎకరాల సీలింగ్ భూమి, 125 ఎకరాల భూదాన్ భూమి ఉందన్నా రు. మొత్తం 1621.12 ఎకరాల భూమిలో పట్టాదారులు, కౌలుదారులున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను సేకరిస్తుందన్నారు. మార్చి నెలాఖరు వరకు ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు స్థానికులు ఎనిమీ ప్రాపర్టీ కారణంగా గ్రామస్తులు ఎదు ర్కొంటున్న సమస్యలను విన్న వించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
హైదరాబాద్ : ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. శంషాబాద్ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం బండ్లగూడకు చెందిన ప్రవీణ్(19) సోమవారం మధ్యాహ్నం మిత్రులతో కలిసి కొత్వాల్‌గూడ సమీపంలోని క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ఈత సరిగా రాని ప్రవీణ్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


