‘ఎనిమీ’తో ఆందోళన వద్దు | Sakshi
Sakshi News home page

‘ఎనిమీ’తో ఆందోళన వద్దు

Published Sat, Feb 10 2018 6:13 PM

enemy property in telangana - Sakshi

శంషాబాద్‌ : కొత్వాల్‌గూడ గ్రామస్తులు తమ భూములకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్‌ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్‌ సురేష్‌తో కలిసి ఆయన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే కృషి చేస్తుందన్నారు. బోగస్‌ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన లావాదేవీలతో గ్రామస్తులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. సదరు సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ ప్రజలకు అనుగుణంగానే అధికారులు ఇప్పటికే పలుమార్లు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. అనవసర అపోహలకు గురై భూములను విక్రయించవద్దని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానన్నారు.  

ఇప్పటికి రెండు సార్లు సమీక్ష... 
ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు జరిగాయని రాజేంద్రనగర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామంలోని 1–174 సర్వే నెంబర్లలో మొత్తం 2700 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇందులో 286 ఎకరాల ప్రభుత్వ భూమి పోను, 685 ఎకరాల సీలింగ్‌ భూమి, 125 ఎకరాల భూదాన్‌ భూమి ఉందన్నా రు. మొత్తం 1621.12 ఎకరాల భూమిలో పట్టాదారులు, కౌలుదారులున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను సేకరిస్తుందన్నారు. మార్చి నెలాఖరు వరకు ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు స్థానికులు ఎనిమీ ప్రాపర్టీ కారణంగా గ్రామస్తులు ఎదు ర్కొంటున్న సమస్యలను విన్న వించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement