బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్‌ దూసుకెళ్లి.. | Seven People died in Different Road Accidents: telangana | Sakshi
Sakshi News home page

బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్‌ దూసుకెళ్లి..

Mar 7 2026 4:46 AM | Updated on Mar 7 2026 4:46 AM

Seven People died in Different Road Accidents: telangana

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం 

హసన్‌పర్తి సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను చిదిమేసిన లారీ 

చొప్పదండిలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితుల మృతి  

అడ్డాకుల/హసన్‌పర్తి/చొప్పదండి: వాహనాల అతివేగం, నిర్లక్ష్యం ఏడు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల శుక్రవారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అవతలి వైపు మార్గంలో వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా ఓ లారీ అతివేగంగా దూసుకెళ్తూ ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరిని బలిగొంది. అలాగే ఓ టిప్పర్‌ సైతం మితిమీరిన వేగంతో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు.

తిరుపతి వెళ్తుండగా..
ఎస్‌స్సై ఎం.వేణు, బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి 28 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన మహబూబ్‌నగర్‌ డిపో ఆర్టీసీ బస్సు 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారు, పొన్నకల్‌ స్టేజీ సమీపంలో డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట నుంచి సిమెంట్‌ పైపులను మహబూబ్‌నగర్‌ తీసుకెళ్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో లారీ, బస్సు క్యాబిన్‌లు నుజ్జునుజ్జు కావడంతో కొత్తకోట మండలం వడ్డెవాటకు చెందిన లారీ డ్రైవర్‌ నందిపేట రవి (35), కొత్తకోటకు చెందిన లారీ సహాయకుడు నాగన్న (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులను  అంబులెన్సుల్లో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించగా బస్సు డ్రైవర్‌ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ మరణించారు. మరో డ్రైవర్‌ రామన్‌గౌడ్‌తోపాటు 10 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో వెంకట్రామమ్మ, శాంతి, సురేశ్‌బాబు, శిరీష ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు చికిత్స అనంతరం వెళ్లిపోయారు.  

ఇంజనీరింగ్‌ పరీక్ష రాసి వస్తుండగా..
హనుమకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని హసన్‌పర్తి పెద్ద చెరువు సమీపంలో శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇంజనీరింగ్‌ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మలుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన  షేక్‌ జునైద్‌ అక్రమ్‌ (21), వరంగల్‌ ఎల్లంబజార్‌కు చెందిన ఆకుతోట సుప్రతిక (21) మృతిచెందారు. వారిద్దరూ హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ సమీపంలోని ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.

జునైద్‌ ఓ ప్రైవే ట్‌ హాస్టల్‌లో ఉంటూ బైక్‌పై కళాశాలకు రాకపోకలు సాగిస్తుండగా సుప్రతిక ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది. కళాశాలలో మిడ్‌ టర్మ్‌ ఎగ్జామ్స్‌ జరుగుతుండటంతో శుక్రవారం పరీక్ష రాశాక జునైద్‌ లిఫ్ట్‌ ఇవ్వడంతో సుప్రతిక బైక్‌పై ఎక్కింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు నుజ్జునుజ్జు కావడంతో స్నేహి తులు కంట తడిపెట్టారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. మృతులిద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. జునైద్‌ తండ్రి షేక్‌ జమీల్‌ అక్రమ్‌ పాన్‌షాపు నిర్వహిçస్తుండగా, సుప్రతిక తండ్రి ఉమామహేశ్వర్‌ పండ్ల వ్యాపారి.

పెళ్లి వేడుకకు వెళ్తుండగా.. 
తమ స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని టిప్పర్‌ రూపంలో మృత్యువు వెంటాడింది. ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన చిలుక ప్రదీప్‌కుమార్‌ (24), తాటికొండ సాయి కిరణ్‌ (24) శుక్రవారం పక్కనే ఉన్న చాకుంటలో స్నేహితుడి వివాహానికి బైక్‌పై వెళ్తున్నారు. మరో పది సెకన్లలో మెయిన్‌ రోడ్డు నుంచి చాకుంట క్రాస్‌ రోడ్డు దాటుతామని అనుకుంటుండగా కరీంనగర్‌ నుంచి ధర్మారం వైపు వెళ్తున్నటిప్పర్‌ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడ్డ వారి తల మీద నుంచి టిప్పర్‌ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ప్రదీప్‌కుమార్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, సాయికుమార్‌ గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement