న్యాల్‌కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని మిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కమ్మ (58) కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. అయితే ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పదవీ ప్రమాణం చేయలేకపోయారు. కాగా, పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మిర్జాపూర్ (ఎన్) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కమ్మ సర్పంచ్‌గా గెలిచారన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబం ఆమె మరణంతో విషాదంలో మునిగిపోయింది.
ఓటేయలేదని బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య
శంకర్‌పల్లి: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని బెదిరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగా రెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై మోకిల సీఐ వీరబాబు, మృతుని తల్లి పద్మ తెలిపిన వివరాలివి. గోపులారం గ్రామానికి చెందిన వెంకటేశ్, పద్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు అనిల్ (28).. దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో చీర సాయికుమార్ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
తనకు మద్దతు తెల పలేదంటూ మంగళవారం రాత్రి అనుచరులతో కలిసి అనిల్‌ను బెదిరించా డు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్ ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పా డు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ బెదిరింపుల వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


