ఎన్నికల్లేకుండా.. ఏకగ్రీవం | First phase of nominations for Panchayat elections concluded in the state | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లేకుండా.. ఏకగ్రీవం

Nov 30 2025 3:09 AM | Updated on Nov 30 2025 3:09 AM

First phase of nominations for Panchayat elections concluded in the state

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ముగిసిన తొలివిడత నామినేషన్లు 

పలుచోట్ల సర్పంచ్, వార్డులకు ఒకే నామినేషన్‌ 

నల్లగొండ జిల్లాలో సర్పంచ్‌ పదవి రూ.51.30 లక్షలకు వేలం

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో నామినేషన్‌ల పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల్లోకి వెళ్తే అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని గ్రామ పెద్దల సహకారంతో పలుచోట్ల ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయ పార్టీ లకు అతీతంగా సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డులను ఏకగ్రీవం చేసుకుంటూ తీర్మానం చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఆయా పదవులకు ఒకే నామినేషన్‌ దాఖలైంది. దాంతో అక్కడ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కానున్నాయి.    

సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములు  
సొంత అన్నదమ్ములు సర్పంచ్‌ బరిలో నిలిచారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు టౌన్‌ సర్పంచ్‌గా కాంగ్రెస్‌ మద్దతుతో అన్న పులి వెంకన్న, బీఆర్‌ఎస్‌ నుంచి తమ్ముడు పులి రామచంద్రు నామినేషన్‌ వేశారు. సర్పంచ్‌ పదవి ఎవరిని వరిస్తుందోనని స్థానికంగా వేచి చూస్తున్నారు. 

ఖాకీ నుంచి ఖద్దర్‌కు..  
సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్న ఓ పోలీస్‌ అధికారి మరో ఐదు నెలలు సర్వీస్‌ ఉండగానే తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న పులి వెంకటేశ్వర్లు స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ. తాజా రిజర్వేషన్లలో ఆ గ్రామం ఎస్సీ జనరల్‌ కావడంతో వెంకటేశ్వర్లు బరిలోకి దిగాలనుకున్నారు.

 పోటీకి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు కావడంతో వెంకటేశ్వర్లు వారం క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామాను జిల్లా ఎస్పీ ఆమోదించినట్లు తెలిసింది. సర్పంచ్‌ పదవికి సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం.  

30 ఏళ్ల నుంచి ఏకగ్రీవమే! 
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి స్వగ్రామమైన పాతలింగాల వాసులు గత ఆనవాయితీని కొనసాగిస్తూ సర్పంచ్‌ అభ్యరి్థని ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. సర్పంచ్‌ను గత 30 ఏళ్ల నుంచి ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తుండడంతో ఎన్నికలు జరగడం లేదు.   

» జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం జిట్టెగూడెంతండా గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచ్‌గా బానోతు బాలు, అలాగే, ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. రఘునాథపల్లి మండలంలోని రామన్నగూడెంలో సర్పంచ్, 8 వార్డు స్థానాల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.  
» జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం రాజారాంతండా గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్‌ గ్రామ సర్పంచుతో పాటు 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.   
» బొంరాస్‌పేట మండల పరిధిలో 6 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పోటీలేకుండా ఏకగ్రీవమయ్యారు.  
» మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండాజీపీలో సర్పంచ్‌ స్థానానికి (ఇస్లావత్‌ నరే‹Ù), 8 వార్డు స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్‌ దాఖలైంది.  
» నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని దాసరిగూడెం గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు.  
» వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.  
» దుద్యాల్‌ మండల పరిధిలోని సంగాయిపల్లిలో గ్రామస్తులంతా కలిసి వెంకట్‌రెడ్డిని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 
» దౌల్తాబాద్‌ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన శానమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది.  
» చొప్పదండి మండలంలోని దేశాయిపేటలో సర్పంచ్‌ పదవితో పాటు, ఎనిమిది వార్డుస్థానాలకు ఒక్కో నామినేషన్‌ పడింది.

రోడ్డు వేస్తామని హామీ ఇస్తేనే ఓట్లు 
రోడ్డు వేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తాం, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ శివారు గ్రామాల ప్రజలు వెల్లడించారు. 

దీనిపరిధిలో ఐదు గ్రామాలు ఉండగా, రేగులగూడెం, అనంతారం, రామకృష్ణాపురం గ్రామా­లకు వెళ్లే మార్గంలో 2004లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కంకర పరిచి వదిలేశారు. కంకర రోడ్డుపైనే ఆ గ్రామాలవాసులు ఆరు కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రమైన కారేపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి మరింత దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  

ముఖ్యమంత్రి స్వగ్రామంలో... 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచి్చన మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, పదిమంది వార్డుసభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటయ్య అలియాస్‌ మోహన్‌ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.  

పొద్దున పరీక్ష.. మధ్యాహ్నం నామినేషన్‌  
కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానానికి మాడిశెట్టి అఖిల్‌(21) అనే డిగ్రీ విద్యార్థి నామినేషన్‌ దాఖలు చేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీకామ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం అకౌంట్స్‌ పరీక్షకు హాజరై మధ్యాహ్నం సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేశాడు.   

వేలంలో పీఠం కైవసం 
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని చి­న్నఅడిశర్లపల్లి గ్రామంలో సర్పంచ్‌ పీఠాన్ని పందుల వెం­కటయ్యగౌడ్‌ రూ.51 లక్ష 30 వేలకు వేలం ద్వారా దక్కించుకున్నారు. గ్రామపెద్దలు ఈ వేలం నిర్వహించా­­రు. ఈ మొత్తాన్ని గ్రామంలోని ఆలయ నిర్మాణాని­కి, బొడ్రాయి ప్రతిష్టకు వినియోగించాలని నిర్ణయించారు.  

కార్మికుల చొక్కా ధరించి.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా మర్రి సంధ్య నామినేషన్‌ దాఖలు చేశారు. ఈమెను బీఆర్‌ఎస్‌ బలపరిచింది. అయితే, ఆమె పారిశుధ్య కార్మికుల మాదిరి ఖాకీ చొక్కా ధరించి నామినేషన్‌ సమర్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement