
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయ్యింది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అందులో పేర్కొంది. ఆ వెంటనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో.. నామినేషన్లు వేయాలనుకునేవాళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక సూచనలు చేసింది.
జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలి. జడ్పీటీసీ నామినేషన్ వేయాలనుకున్న జనరల్ కేటగిరీ అభర్థి.. రూ.5 వేలు, అదే రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి.
ఎన్నికల నియమావలికి అనుగుణంగా నామినేషన్ సందర్బంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గం. వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.
అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలి. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది. 15వ తేదీ మధ్యాహ్నాం 3గం.లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే.. ప్రచార నిబంధనలు, ఆచరణ నియమావళి త్వరలో విడుదల అవుతుంది.
ఇదీ చదవండి: తెలంగాణ ఈ ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి!