Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి | Strange situation for MLAs who switched parties | Sakshi
Sakshi News home page

Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి

Oct 9 2025 8:00 AM | Updated on Oct 9 2025 8:00 AM

Strange situation for MLAs who switched parties

కండువా కప్పుకోలేరు.. ప్రచారానికి వెళ్లలేరు 

అనుచరులు, వారసుల గెలుపు కోసం పనిచేయలేని వైనం 

పదవిపై వేలాడుతున్న అనర్హత కత్తి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలు క్లిష్టంగా మారాయి. పార్టీ మారామని చెప్పుకోలేని పరిస్థితి ఓవైపు.. కొత్త కండువా వేసుకుని తమ అనుచరులకు మద్దతుగా ప్రచారం చేయలేని పరిస్థితి మరోవైపు వీరిని ఇబ్బంది పెడుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు, స్పీకర్‌ విచారణ ఇరకాటంలోకి నెట్టాయి. సంస్థాగతంగా పట్టుకోసం తమ అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బరిలోకి దించేందుకు ఇప్పటికే అధిష్టానానికి పలు పేర్లను సిఫార్సు చేసినప్పటికీ.. అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. 

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన తర్వాత అధికార కాంగ్రెస్‌ గూటికి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ వద్ద వీరిద్దరూ సీఎం సమక్షంలో కండువా కప్పుకొన్న ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వీరు స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్తే న్యాయస్థానంతో పాటు స్పీకర్‌కు నేరుగా సాక్ష్యం అందించిన వారవుతారనేది అక్షర సత్యం.   

అభివృద్ధి కోసం అటుఇటు..! 
చేవెళ్ల నియోజకవర్గంలో మెయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లితో పాటు వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ, 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయ ప్రస్థానం తన సొంత మండలమైన నవాబుపేట నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్‌ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీఫాంపై పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 

2024లో కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి అధికార కాంగ్రెస్‌ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కారు దిగి.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కోర్టును ఆశ్రయించడం, బంతి స్పీకర్‌ కోర్టులోకి నెట్టడం, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ సదరు ఎమ్మెల్యేకు స్పీకర్‌ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. నెత్తిన అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలోనే విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది.  

జెడ్పీ పీఠం కోసం.. 
ఈసారి జిల్లా పరిషత్‌ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడం తన నియోజకవర్గంలోని షాబాద్‌ ఎస్సీ మహిళకు, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాలు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో షాబాద్‌ లేదా చేవెళ్ల నుంచి తన కోడలిని నిలబెట్టి జెడ్పీ చైర్‌పర్సన్‌ సీటు దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న ట్లు సమాచారం. కానీ కాంగ్రెస్‌ కండువా వేసుకుని నేరుగా ప్రచారం చేయలేని సంకటం ఎదురైంది.  

ప్రకాశ్‌గౌడ్‌దీ ఇదే పరిస్థితి.. 
రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాల్లోని రాజేంద్రనగర్‌ మండలం పూర్తిగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లింది. గండిపేటలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. కేవలం శంషాబాద్‌ మండలంలోనే స్థానిక సంస్థలున్నాయి. ఇక్కడ 21 గ్రామ పంచాయతీలు, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్‌ నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సైతం రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు తనను నమ్ముకుని, వెంట వచి్చన అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఒకవేళ వీరికి అవకాశం వచి్చనా నేరుగా ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement