సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆ ప్రాంతాల్లో ఎల్లుండి సాయంత్రం దాకా మందు బంద్ కానుంది. మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రచారం.. నేటి సాయంత్రంతో ముగిసింది.
తెలంగాణ వ్యాప్తంగా .. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో (మంగళవారం, డిసెంబర్ 9)ముగిసింది. సాయంత్రం నుంచి మైకులు మూగబోగా.. ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ కానున్నాయి. కాదని తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల్లో అమ్మడం, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎల్లుండి(గురువారం, డిసెంబర్ 11న) మొదటి విడత 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు.


