చివరి రోజు భారీగా నామినేషన్లు | Huge number of nominations on the last day | Sakshi
Sakshi News home page

Telangana: చివరి రోజు భారీగా నామినేషన్లు

Nov 30 2025 3:12 AM | Updated on Dec 4 2025 11:37 AM

Huge number of nominations on the last day

నల్లగొండ జిల్లా ఎన్‌జీ కొత్తపల్లిలో రాత్రి 8 వరకు అభ్యర్థుల నిరీక్షణ

సాయంత్రం 5 తర్వాతా క్యూలైన్‌లో ఉండటంతో కొనసాగిన ప్రక్రియ 

మంచి రోజు కావడంతో బారులుతీరిన అభ్యర్థులు 

తొలి విడత పంచాయతీకి ముగిసిన నామినేషన్లు 

నేటి నుంచి రెండో విడత షురూ..  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చివరిరోజైన శనివా­రం భారీ స్పందన కనపడింది. గురు, శుక్రవారాల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఆఖరు రోజు సమర్పించిన నామినేషన్లకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి శనివారం అర్ధరాత్రి వర­కు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కి పూర్తిస్థాయి సమాచారం చేరలేదు. సర్పంచ్, వార్డు సభ్యస్థానాలకు రాత్రి 8, 9 గంటల దాకా కూడా అభ్యర్థు­ల నామినేషన్ల దాఖలు సాగింది. 

శనివారం మంచి­రోజు కావడంతోపాటు మధ్యాహ్నం తర్వాత శుభముహూర్తం ఉండడంతో నామినేషన్ల సమర్పణకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంట­ల వరకు నామినేషన్లు వేసేందుకు క్యూలో ఉన్న వారి­కి టోకెన్లు ఇచ్చి కూర్చోబెట్టినట్టు అధికారవర్గాల స­మా­చారం. అర్ధరాత్రి వరకు కూడా మొత్తం ఎన్ని నా­మినేషన్లు పడ్డాయనే దానిపై స్పష్టమైన సంఖ్య తెలియరాలేదు. 

చివరిరోజు సర్పంచ్‌ పదవికి 20వేలకు పైగా, వార్డు సభ్యుల పదవికి 50వేలకు పైగా నామి­నేషన్లు దాఖలైనట్లు అంచనా. దీనిపై ఆదివారం స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. వచ్చేనెల 11న మొదటి దశలో 4,236 పంచాయతీల్లోని సర్పంచ్‌పదవులు, 37,440 వార్డు సభ్య స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ నామినేషన్ల పరిశీలనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై సోమవారం అప్పీలు చేసుకునే వీలు కల్పించారు. డిసెంబర్‌3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.    

నేటి నుంచి రెండో విడత నామినేషన్లు 
డిసెంబర్‌ 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం ఆదివారం నుంచి మూడురోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ విడతలో 4,333 సర్పంచ్‌ పదవులకు, 38,350 వార్డుసభ్యస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్లు ఇలా..
పదవి       జీపీలు       తొలిరోజు      రెండోరోజు 
సర్పంచ్‌     4,236       3,242    4,901
వార్డులు     37,440     1,821    9,643

Advertisement
 
Advertisement
Advertisement