మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవికి నర్సింహారెడ్డి ఇద్దరు భార్యలు లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా. శనివారం రజిత తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో లావణ్య ఒక్కరే పోటీలో ఉండటంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. పంచాయతీ పరిధిలోని 10 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
భర్త నామినేషన్ రిజెక్ట్.. భార్య అభ్యర్థిత్వానికి ఓకే
స్కూల్ అసిస్టెంట్, అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు వదిలి...
ఇబ్రహీంపట్నం రూరల్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్‌లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ బింగి రాములయ్య ఓ రాజకీయ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. మరో పది నెలల సర్వీస్ ఉండగానే వీఆర్‌ఎస్ కోసం ప్రయత్నించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 30న తన రాజీనామా పత్రాన్ని డీఈఓ సుశీందర్‌రావుకు అందజేశారు. రాములయ్య సతీమణి బింగి గీత సైతం ఇదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 5న తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పీడీకి లేఖ అందజేశారు. అనంతరం ఆమె కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గీత రాజీనామాకు సంబంధిత శాఖ నుంచి ఎన్‌ఓసీ జారీ కాగా, ఆమె అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. కానీ, విద్యాశాఖ నుంచి రాములయ్యకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది.


