స్థానికంపై నేడు నిర్ణయం! | Cabinet to meet under CM Revanth reddy: Telangana cabinet meeting scheduled for Oct 23 | Sakshi
Sakshi News home page

స్థానికంపై నేడు నిర్ణయం!

Oct 23 2025 6:13 AM | Updated on Oct 23 2025 6:13 AM

Cabinet to meet under CM Revanth reddy: Telangana cabinet meeting scheduled for Oct 23

సీఎం అధ్యక్షతన భేటీ కానున్న మంత్రివర్గం

న్యాయ నిపుణుల సలహాపై చర్చించే చాన్స్‌!

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విష యం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్‌ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.

అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఇలావుండగా.. ఇద్దరుకు మించి సంతానం కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని పంచాయతీ రాజ్‌ చట్టంలో ఉన్న నిబంధనను ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఆ మేరకు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్‌ జారీ చేసేలా గవర్నర్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించనుంది.  

ఎస్‌ఎల్‌బీసీ కాంట్రాక్టు రద్దు ..?
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగాల నిర్మా ణ సంస్థ జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ చేసిన సిఫారసులపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. అలా చేస్తే పెరిగిన ధరల ఆధారంగా అంచనాలు కొన్ని రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా తేల్చవచ్చని అంటున్నారు. 

కాళేశ్వరం టెండర్లకు ఓకే?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గం రాటిఫై చేయనుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి డిసెంబర్‌ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. విజయోత్సవాల్లో భాగంగా సనత్‌నగర్‌ టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement