చిన్ననారాయణపురంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి
నార్కట్‌పల్లి: మండల పరిధిలోని చిన్ననారాయణపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మెరుగు అనితకు, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనితకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనిత గెలుపొందినట్లు ప్రకటించారు.
కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రీకౌంటింగ్ నిర్వహించగా.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెరుగు అనిత ఒక ఓటుతో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిపై గెలిచినట్లు ధ్రువీకరణ చేశారు. అయితే సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయినా.. సర్పంచ్ నేనే అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు. కాగా గ్రామ పంచాయతీలో 8 వార్డులకు గాను ఐదు వార్డులు బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. ముగ్గురు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉప సర్పంచ్, బీఆర్‌ఎస్ బలపర్చిన వార్డు సభ్యులు హాజరు కాలేదు. దీంతో కేవలం సర్పంచ్‌తోపాటు ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులతో మాత్రమే ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు.


