యాదాద్రి భువనగిరి జిల్లా: మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబ సభ్యులు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మచ్చ చంద్రమౌళి తొలిసారిగా 1995లో చీకటిమామిడి గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైయ్యారు. ఐదేండ్లు ప్రజలతో మమేకమై పని చేయడంతో 2001లో సైతం రెండో సారి ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 2007లో చంద్రమౌళిగౌడ్ మాతృమూర్తి కళావతి సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 2013లో చంద్రమౌళి గౌడ్ సోదరుడు శ్రీనివాస్‌గౌడ్ ఎంపీటీసీగా గెలుపొందగా 2019లో మచ్చ శ్రీనివాస్‌గౌడ్ సతీమణి మచ్చ వసంత సర్పంచ్‌గా గెలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబం గ్రామానికి నిస్వార్థంగా సేవలందించి ప్రశంసలు పొందారు.
సర్పంచ్‌గా 30 ఏళ్లు..
కొండమల్లేపల్లి : రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తున్న గ్రామపంచాయతీల జాబితాలో కొండమల్లేపల్లి పేరు ఉటుంది. దానిని ఆస్థాయిలో తీర్చి దిద్దిన ఘనత గ్రామ మొదటి సర్పంచ్ కుంభం పుల్లారెడ్డికే దక్కుతుంది. 1959లో కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఏర్పడింది. మొదటి సర్పంచ్‌గా కుంభం పుల్లారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత 1964లో రెండో సర్పంచ్‌గా నాయిని పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1969 నుంచి 2000 సంవత్సరం వరకు సుమారు వరుసగా 30 సంవత్సరాల పాటు కుంభం పుల్లారెడ్డి సర్పంచ్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే కొండమల్లేపల్లి పశువుల సంతను అభివృద్ధి చేశారు. దాంతో ప్రస్తుతం సంత నుంచి ప్రతి ఏటా రూ. 1.23కోట్ల ఆదాయం గ్రామపంచాయతీకి సమకూరుతోంది.
మేము డబ్బులు తీసుకోము..
ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : ఎన్నికల్లో డబ్బులు, మద్యం ప్రభావం అధికం. పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు ఇంత అంటూ రేటు నిర్ణయించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యల్లంకొండ వెంకట్‌రెడ్డి తన ఇంటి గోడపై రాయించిన వాల్ పేయింటింగ్ గ్రామంలో చర్చనీయాంశమైంది. ‘మేము డబ్బులు తీసుకొని ఓటు వెయ్యం.. ప్రభావితం చేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటాం’ అని తన ఇంటి ప్రహరీపై రాయించాడు.


