సీఎస్‌కు చేరిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్..
నేడు ‘సర్క్యులేషన్ మెథడ్’లో మంత్రుల సంతకాలు...ఆ వెంటనే జీఓ జారీ
రెండు రోజుల్లో పీఆర్‌శాఖ ద్వారా రిజర్వేషన్ల ఖరారు.. 24న పిటిషన్‌పై విచారణ
అదే రోజు కోర్టుకు రిజర్వేషన్ల జీఓ, ఎన్నికలకు సిద్ధమని తెలియజేయనున్న పీఆర్‌శాఖ
ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణికుముదిని సమీక్ష
ప్రతి జిల్లాలో మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ప్రభుత్వ ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు గురువారం సీఎస్ రామకృష్ణారావుకు నివేదికను సమర్పించారు. దీనిపై సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రుల నుంచి శుక్ర, శనివారాల్లోగా ఆమోదం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి కోర్టుకు జీఓ కాపీని సమర్పించనున్నట్టు తెలిసింది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై గురువారం సమీక్షించారు. ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. 23న తుది జాబితా వెలువడనుంది.
స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. శుక్ర లేదా శనివారం సాయంత్రం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీఓ జారీ చేయనున్నది. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా జిల్లా కలెక్టర్లు, సీఈఓలు, డీపీఓలకు పంపించినట్టు సమాచారం. నేడో, రేపో జారీచేసే జీఓకు అనుగుణంగా రెండు రోజుల్లో 31 జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశముంది.

జిల్లా ల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లపై జిల్లా కలెక్టర్లు గెజిట్ విడుదల చేస్తారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే, మూడు విడతల్లో నిర్వహించే ఎన్నికల తేదీపై తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్‌శాఖ అందజేయనుంది. ఇది అందుకున్న వెంటనే అంటే అదే రోజు లేదా ఒక రోజు వ్యవధితో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే డిసెంబర్ 10 నుంచి 20 తేదీల్లోగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కోదశ ఎన్నిక మధ్య మూడేసి రోజుల అంతరం ఉండనుంది. డిసెంబర్ 10, 11 తేదీల్లో మొదటి విడత, 14, 15 తేదీల్లో రెండో విడత, 18,1 9 తేదీల్లో మూడో విడత ఎన్నికలు జరగొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైకోర్టులో విచారణ కీలకం
ఈ నెల 24న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వపరంగా చేస్తున్న సన్నాహాలు, జీఓ జారీ తదితర విషయాలను హైకోర్టుకు పీఆర్‌ఆర్డీ శాఖ తెలియజేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు విన్నవించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణికుముదిని ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహా) పంచాయతీ ఎన్నికలపై సమీక్షించారు.
సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్ బాస్‌లు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబధించి భద్రతా అంశాలు, స్థానిక పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, అధికారుల అభిప్రాయాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ ప్రతిపాదించారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే...ఈ నెల 24న కోర్టులో ప్రస్తావనకు వచ్చే అంశాలు, 50 శాతం లోపు రిజర్వేషన్లు ఇతర అంశాలను అటు ప్రభుత్వం, ఇటు ఎస్‌ఈసీ నిశితంగా పరిశీలించనుంది.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కమిషనర్ రాణి కుముదిని
స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఎన్నికల పరిశీలకులకు శిక్షణ ఇస్తామని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలన్నారు. ఈ ఏడాది గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆదేశాలు ఇచి్చనట్టు ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.


