
సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ శివధర్‌రెడ్డి. చిత్రంలో స్వాతి లక్రా, మహేశ్ భగవత్
కొత్త డీజీపీ ఎఫ్–3 మంత్రం
ఇదే తన విధానమన్న డీజీపీ శివధర్‌రెడ్డి
అవినీతిని సహించేది లేదని స్పష్టం
డీజీపీగా తొలిసారి పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఫెయిర్.. ఫర్మ్..ఫ్రెండ్లీ (ఎఫ్–3) అనేవి తెలంగాణ పోలీస్ మూల సూత్రాలని డీజీపీ బి.శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. నిష్పాక్షికమైన, దృఢమైన, స్నేహపూర్వక, ప్రొఫెషనల్ పోలీసింగ్ ప్రజలకు అందించేందుకు పోలీస్‌శాఖలోని ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శివధర్‌రెడ్డి తొలిసారి రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, డీసీపీలతో జరిగిన సమావేశంలో డీజీపీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఫెయిర్ (న్యాయమైన) పోలీసింగ్ అంటే ప్రతి పౌరుడిని చట్టం ముందు సమానంగా చూస్తూ నిష్పక్షపాతంగా న్యాయం అందించడం. ఫర్మ్ (దృఢమైన) పోలీసింగ్.. అంటే భయం లేదా పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేస్తూ శాంతి భద్రతలను నెలకొల్పడం. ఫ్రెండ్లీ (స్నేహపూర్వక) పోలీసింగ్ అంటే పౌరులలో విశ్వాసం, సానుభూతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. అలాగే ప్రొఫెషనల్ (వృత్తిపరమైన) పోలీసింగ్ అంటే.. సామర్థ్యం, నీతి, క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నాలుగు సూత్రాలు ఆధునిక పోలీసింగ్ స్ఫూర్తిని నిర్వచిస్తాయి. మానవీయ కోణంలో పనిచేస్తూ.. నీతి, సామర్థ్యంలో రాజీపడకుండా పనిచేయాలి’ అని దిశానిర్దేశం చేశారు.
బేసిక్ పోలీసింగ్ మరవొద్దు
బేసిక్ పోలీసింగ్ తెలంగాణ పోలీసుల ఆపరేషనల్ వెన్నెముకగా ఉండాలని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. బేసిక్ పోలీసింగ్‌లో కీలకమైన బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇంటెలిజెన్స్ సేకరణ, అత్యవసర స్పందన, నేర నివారణ, గుర్తింపు, ప్రజా శాంతిభద్రతల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ తప్పక ఉండాలని చెప్పారు. కేవలం నేరగణాంకాల్లో తగ్గుదలే బేసిక్ పోలీసింగ్ విజయానికి కొలమానం కాదని, పోలీసులపై ప్రజల విశ్వాసం, నమ్మకం, సంతృప్తి ద్వారా కొలవాలని ఆయన నొక్కిచెప్పారు. బేసిక్ పోలీసింగ్‌ను ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా పోలీసుల సామర్థ్యాన్ని పెంచవచ్చని అభిప్రాయ పడ్డారు.
కొత్తగా ఎంపికైన డీఎస్పీల శిక్షణ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందని అదనపు డీజీ (ట్రైనింగ్) వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.